వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను రాజునని, తనను రాజసింహాసనం మీదినుంచి ఎవ్వరూ పక్కకు తప్పించలేరని అనుకున్నారు. అధికారం తనకు శాశ్వతం అని ఆయన తలపోశారు. తన తర్వాత మరో పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉన్నదని, అప్పుడు తమ నిర్ణయాలను సమీక్షిస్తారని ఆయనకు ఊహకు కూడా అందినట్టు లేదు. అందుకే.. ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. తత్ఫలితంగా.. ఆయన పాలన కాలంలో.. అడ్డదారుల్లో ఆయన నుంచి అనుచిత ప్రయోజనాలు పొందిన వారు, అడ్డగోలుగా ఆయన భజనలో తరిస్తూ అదే ప్రభుత్వోద్యోగంగా బతికిన వాళ్లు ఇప్పుడు ఇక్కట్లలో పడుతున్నారు. జగన్ సర్కారు హయాంలో జరిగిన దారుణాల మీద చంద్రబాబు సర్కారు దృష్టి సారిస్తోంది. ఆయన భజననే బతుకుగా మార్చుకున్న వారు ఇప్పుడు జైలుకెళ్లాల్సి వస్తుందా అనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.
విషయం ఏంటంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లను ఏర్పాటుచేశారు. ఈ కార్పొరేషన్ల ద్వారా.. రాష్ట్రంలోని యువతరానికి నైపుణ్యాలను పెంచేసారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పార్టీ సిఫారసులను బట్టి.. వందల మందికి ఈ కార్పొరేషన్లలో ఉద్యోగాలు కట్టబెట్టారు. ఒక్కొక్కరికి లక్షల రూపాయల వేతనాలు చెల్లించారు. ఇంతకూ వారేం చేశారు?
వారు చేసినదెల్లా జగన్ భజన మాత్రమే. వైసీపీ సోషల్ మీడియా దళాల్లో యాక్టివ్ గా ఉంటూ.. జగన్ భజన చేయడం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యర్థి నాయకుల మీద నీచమైన స్థాయిలో బురద చల్లుతూ బతకడం మాత్రమే. ఆఫీసుకే వెళ్లకుండా, ఆఫీసు అన్నది ఎక్కడున్నదో తెలియకుండా జీతాలు తీసుకున్న వాళ్లు కొందరుంటే.. అసలు ఉద్యోగులు కూడా లేకుండా జీతాలు డ్రా చేసిన వైనం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.
అక్రమ నియామకాలు, ఎక్కడెక్కడో ఉన్నవారికి జీతాలు ఇవ్వడం, కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట దోచిపెట్టినవైనంపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. అప్పుడు గవర్నమెంటు నుంచి జీతం తీసుకుంటూ జగన్ భజన చేస్తూ బతికిన వాళ్లంతా కూడా ఇప్పుడు నిందితులుగా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందా? వారికి దోచిపెట్టిన అధికారులతో పాటు, లబ్ధి పొందిన వారు కూడా మూల్యం చెల్లించాల్సిందేనా? అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
జగన్ భజనే బతుకైన వాళ్లు జైలుకేనా?
Monday, November 4, 2024