ఐదేళ్లపాటు పరిపాలన సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యావత్తు అధికార యంత్రాంగంలో పూర్తిగా తన మనుషులను నియమించుకున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. ప్రతి విభాగంలోనూ చిన్నా పెద్దా అన్ని రకాల పోస్టుల్లో తన మనుషులే. తన భక్తులే. అన్ని విభాగాలకు అధిపతుల స్థాయిలో కేవలం ఒక సామాజిక వర్గం వారిని మాత్రమే నియమించుకోవడం కూడా కేవలం జగన్ సర్కారు హయాంలో మాత్రమే మనం గమనించాం.
చంద్రబాబు ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత.. ఎంతగా ప్రక్షాళన చేస్తున్నప్పటికీ.. జగన్ వీర భక్తులను స్థానమార్పిడి చేసినప్పటికీ.. ప్రభుత్వ విభాగాల్లో కీలక శాఖల్లో, కీలక పదవుల్లో జగన్ కోవర్టులు, భక్తులు ఇంకా అలాగే ఉన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. శాసనసభ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటలే ఇందుకు రుజువుగా కనిపిస్తున్నాయి.
సభ లాబీల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మంత్రులను మాయచేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని అనడం విశేషం.
లాబీల్లో డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తారసపడ్డారు. అధికారుల తీరు గురించి వీరి మధ్య మాటలు నడిచాయి. సభలో సభ్యుల ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలకు మంత్రులకు అందివ్వడం లేదని ఇద్దరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
‘అవును కాదు ఉత్పన్నం కాదు’ వంటి డొంకతిరుగుడు సమాధానాలు తయారుచేసిన అధికారుల తీరును పవన్ కల్యాణ్ తప్పుపట్టారు.
ఇప్పటికే ప్రభుత్వంలో పలు విభాగాల్లో జగన్ కోవర్టులు నిండుగా ఉన్నారనే పుకార్లున్నాయి. జగన్ భక్త ఐఏఎస్, ఐపీఎస్ లను, కొందరు కీలక అధికారులను మార్చినప్పటికీ.. ఇతర స్థాయుల్లో కూడా పుష్కలంగా జగన్ భక్తులు చొరబడి ఉన్నట్టుగా నాయకులు భావిస్తున్నారు. గత అయిదేళ్లలో కీలక స్థానాల్లోకి వచ్చిన ప్రతి బదిలీని కూడా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఉన్నదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవలే.. ప్రభుత్వంలో ఇంకా జగన్ కోవర్టులు ఎవరెవరు ఉన్నారో జల్లెడ పట్టాల్సిందిగా చంద్రబాబునాయుడు కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ప్రభుత్వశాఖల్ని శల్యపరీక్ష చేస్తారని అర్థమవుతోంది.