ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని పోలీసుల ద్వారా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలను నాయకులు వేధించడం జరుగుతున్నదని అనేక ఆరోపణలు మనకు నిత్యం వినిపిస్తూ ఉంటాయి. పత్రికల్లో వస్తున్న వార్తలు జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఇందులో అబద్ధం లేదని ఎవరైనా అనుకుంటారు. అయితే మరో కోణంలో చూసినప్పుడు, నిజానికి ఏపీలోని పోలీసులు భయంతో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పెద్ద నాయకుడు కాకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మామూలు కార్యకర్త, సోషల్ మీడియా విభాగం ఐటిడిపి కోఆర్డినేటర్ స్థాయి వ్యక్తికి సి ఆర్ పి సి 41 ఏ నోటీసులను అందించడానికి, వారు అర్ధరాత్రి రెండు గంటల వేళ అపార్ట్మెంట్ కి వెళ్లడం చూస్తే పగలు వెళ్లాలంటే పోలీసులకు భయమా అని జాలేస్తుంది.
గురజాల నియోజకవర్గంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి దాచేపల్లిలో నివాసం ఉంటారు. ఆయన ఐటీడీపీ విభాగంలో కార్యకర్తగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే 2021, 2022 సంవత్సరాల్లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో ఈ నాగేశ్వరరావు పాల్గొన్నట్లుగా పోలీసు రికార్డుల్లో ఉంది. అప్పట్లో పోలీసులు అనుమతి ఇవ్వని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆయన మీద కేసులు నమోదయి ఉన్నాయి. ఇవేమీ అంతర్జాతీయ మనీ లాండరింగ్ కు పాల్పడిన కేసులు గాని, మూక హత్యలు- బ్యాంకు దోపిడీలకు సంబంధించిన కేసులు గాని కావు. నిందితుడు పరారీలో ఏమీ లేడు. పారిపోతాడనే భయం కూడా లేదు. నిజానికి అతనిని అరెస్టు చేసే అంత అవసరం కూడా లేదు. కేవలం అతనికి 41ఏ నోటీసులు ఇవ్వాలి, అంతే!
టిష్యూ పేపర్ లాగా వాడి పారేసిన వైఎస్ షర్మిల : ఎవరినో తెలుసా?
అయినాసరే పిడుగురాళ్ల పోలీసులు చాలా బీభత్సరస ప్రధానమైన యాక్షన్ ఎపిసోడ్ నడిపించారు. అర్ధరాత్రి రెండు గంటల వేళ ఆ వ్యక్తి నివసిస్తున్న అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లారు. అది కూడా తెల్ల కారులో ఒక పోలీసు ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లి, మహిళా వాచ్మెన్ ను నిద్రలేపి ప్రహరీ గేటు తాళం తీయించారు. మరొక ఫ్లాట్ తలుపు తట్టి అందులో నివసిస్తున్న వారిని నాగేశ్వరరావు ఫ్లాట్ ఏదని ఆరా తీశారు.
నాగేశ్వరరావు ఇంటి తలుపు తట్టడం ఆయన తలుపు తీసిన వెంటనే అతడిని లాక్కొని లిఫ్ట్‌లో నుంచి కిందకు తీసుకు వెళ్లిపోవడం జరిగింది. అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? అని ఆయన భార్య గగ్గోలు పెడుతూనే ఉంది. నాగేశ్వరరావును రెండు మూడు చోట్లకి తిప్పిన పోలీసులు చివరకు పిడుగురాళ్ల స్టేషన్‌కు తీసుకువచ్చి, ఉదయం 10 గంటల సమయంలో ఎందుకు తీసుకువచ్చామో కారణం చెప్పారు. పాత కేసులకు సంబంధించి కేవలం నోటీసు ఇవ్వడానికే తీసుకొచ్చాం అనే సంగతిని ఆ తర్వాత 12 గంటల సమయంలో మీడియాకు వెల్లడించారు. తర్వాత విడిచిపెట్టారు.
పాత కేసుల విషయంలో కనీసం ఇప్పటికైనా పోలీసులు చర్య తీసుకోదల్చుకున్నారు మంచిదే! కానీ కేవలం నోటీసులు సర్వ్ చేయడానికి, అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్ల మీద దాడి చేయాల్సిన అవసరం ఉందా? ఇలాంటి చర్యలు మానవ హక్కుల హననం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.