దాదాపు 3500 కోట్ల రూపాయలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్వాహా చేసిన మద్యం కుంభకోణంలో రోజురోజుకూ కొత్త సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరి గుట్టు దాచుకున్న మరొకరి వివరాలు రోజుకొకటిగా బయటకు వస్తున్నాయి. అసలు అంతిమ లబ్ధిదారుగా జగన్ పేరు వినిపిస్తోంది. ఇంకా ఆయన నేరాన్ని నిరూపించే బలమైన ఆధారాలు సమకూరలేదు. కానీ ఇప్పటికే ఈ అతిపెద్ద కుంభకోణంలో అనేక మంది కీలక వ్యక్తులు అరెస్టు అయ్యారు. వారి బాగోతాలు దాచుకున్న వారు కూడా ఇవాళ అరెస్టు అయ్యారు. అసలు కుంభకోణానికి కీలక సూత్రధారిగా గుర్తింపు తెచ్చుకున్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి తరఫున డిస్టిలరీకి ఫోన్లు చేసి దందాలు వసూలు చేయడం వాటినిన హైదరాబాదులోని ఒక ఆఫీసుకు సమీకరించి.. పంపవలసిన చోటుకు పంపడం లాంటి బాధ్యతలు నిర్వర్తించిన కీలక వ్యక్త్తి పైలా ప్రదీప్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
పైలా ప్రదీప్ అనే ఈ కీలక నిందితుడు.. గతంలో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డికి పీఏగా పనిచేశారు. మద్యం తయారీదార్లనుంచి వసూళ్లపర్వానికి రాజ్ కెసిరెడ్డి బాస్ అయితే.. బాస్ ఆదేశాల మేరకు కిందనున్న బంట్లతో పనులు చేయించే వ్యక్తి ఈ పైలా ప్రదీప్ అన్నమాట. అధికారికంగా అయితే.. ప్రభుత్వ ఐటీ సలహాదారు అయిన రాజ్ కెసిరెడ్డికి.. ఈ పైలా ప్రదీప్ పీఏగా పనిచేశాడు. ఇప్పటిదాకా పలువురిని విచారించే క్రమంలో ఇతని పాత్రను సిట్ పోలీసులు గుర్తించారు. డిస్టిలరీల యజమానులను విచారించినప్పుడు ఇతని పాత్ర బయటకు వచ్చింది. రాజ్ కెసిరెడ్డి కార్యాలయం నుంచి పీఏ పైలా ప్రదీప్ ఫోన్లు చేసి ముట్టవలసిన సొమ్ము వివరాలు చెప్పేవాడని, ఆయన ఆదేశాల ప్రకారం పంపేవారమని వారు వెల్లడించారు.
తన పాత్ర బయటపడిందని అర్థమైన పైలా ప్రదీప్ హైదరాబాదునుంచి చెన్నై పారిపోయి.. అక్కడినుంచి మారుపేరుతో దుబాయి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే తమకు సమాచారం అందిన రోజు నుంచి కూడా పైలా ప్రదీప్ పై నిఘా ఉంచిన సిట్ పోలీసులు ఆ విషయం సకాలంలో పసిగట్టారు. చెన్నై వెళ్లాడనే సంగతి తెలుసుకుని.. అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. విజయవాడ నుంచి ఒక బృందం ప్రత్యేకంగా చెన్నై వెళ్లింది. మొత్తానికి చెన్నై నుంచి దుబాయి పారిపోవడానికి ముందే ప్రదీప్ ను అరెస్టు చేశారు.
పైలా ప్రదీప్ ను కూడా విచారిస్తే మద్యం కుంభకోణానికి సంబంధించి ఇంకా అనేక వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అనుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం జుడీషియల్ రిమాండులో ఉన్న రాజ్ కెసిరెడ్డిని వారం రోజుల పాటు తమ కస్టడీ విచారణకు ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు. రాజ్ కెసిరెడ్డిని, పైలా ప్రదీప్ ను కలిపి విచారించడం వల్ల కేసులో మరింత పురోగతి ఉంటుందని అనుకుంటున్నారు. అసలు సూత్రధారులు బయటకు వచ్చే క్రమంలో పైలా ప్రదీప్ అరెస్టు ఒక కీలకం అని పలువురు భావిస్తున్నారు.
కెసిరెడ్డి సీక్రెట్లు తెలిసిన మరో కీలక అరెస్టు!
Friday, December 5, 2025
