నిందితుల జాబితాలోకి మరో మాజీమంత్రి: త్వరలో అరెస్టు!

Thursday, December 18, 2025

అయిదేళ్ల పాటు జగన్ కు కొమ్ముకాస్తూ.. ఆయన నీడలో ఆయన అండదండలతో తమకు తోచిన మార్గాల్లో అడ్డగోలుగా రాష్ట్రాన్ని, ప్రజలను దోచేసుకున్న వారందరికీ ఇప్పుడు మూడుతోంది. చేసిన పాపాలకు శిక్షలు అనుభవించాల్సి వస్తోంది. నెల్లూరు జిల్లాలో విచ్చలవిడిగా సాగుతూ కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా నిందితుల జాబితాలోకి వచ్చి చేరింది. ఈ కేసులో ఇప్పటికే ఒక మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి రెండు నెలలుగా రిమాండులోనే ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట ఈ ఇద్దరు మాజీ మంత్రులకు కీలక అనుచరుడు అయిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేశారు. ఆయన నుంచి రాబట్టిన సమాచారం మేరకు నిందితుల జాబితాలోకి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా చేర్చినట్టుగా తెలుస్తోంది. నేడో రేపో అనిల్ కుమార్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని, అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నదని చెబుతున్నారు.

నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ అక్రమాల్లో కీలక పాత్రధారి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. ఆయన పోలీసుల విచారణలో సమస్త వివరాలు వెల్లడించినట్టుగా వార్తలు వస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షం అయింది. దాని ప్రకారం.. మాజీ మంత్రులు కాకాణి గోవర్దన రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లకు తాను ముఖ్య అనుచరుడినని, వారితో కలిసి వ్యాపార లావాదేవీల్లో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

క్వార్ట్జ్ కు మంచి డిమాండు ఉండడంతో అక్రమమైనింగ్ చేసి తరలించినట్టు చెప్పారు. లీజు అయిపోయి మూతపడి ఉన్న రుస్తుం మైన్స్ గురించి తెలుసుకుని, ఆ మైన్స్ లో తవ్వకాలు జరిపి తీయించామని.. వాటిని గ్రేడింగ్ చేసి చెన్నై ద్వారా చైనాకు ఎగుమతి చేశామని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఈ నేరం యొక్క తీవ్రత తెలుసు గనుకనే.. కేసులు నమోదు అయిన తర్వాత.. కాకాణి గోవర్దన రెడ్డి సుదీర్ఘకాలం పాటు అసలు పోలీసులకు చిక్కకుండా కలుగులో దాక్కున్నారు. న్యాయపరంగా ఉపశమనం పొందడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. ఈలోగా పరారీలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి బెయిలు కూడా రాకపోవడంతో ఆయన రిమాండులోనే గడుపుతున్నారు.

తాజాగా అనిల్ కుమార్ యాదవ్ కీలక అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేసి తరలించడంతో అందరి దృష్టి అనిల్ పైకి మళ్లింది. త్వరలోనే ఆయన అరెస్టు కూడా జరుగుతుందని రెండు రోజులుగా చర్చలు సాగుతున్నాయి. శ్రీకాంత్ రెడ్డి తన వాంగ్మూలంలో ఇద్దరు మంత్రుల పేర్లు స్పష్టంగా బయటపెట్టడంతో.. అనిల్ అరెస్టు తప్పదని తేలిపోయింది. పోలీసులు ఇప్పటికే ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీచేశారని, త్వరలోనే అరెస్టు ఉంటుందని అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles