చంద్రబాబునాయుడుకు హైటెక్ ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి సీఈవోగా భిన్నరకాల గుర్తింపు ఎంతైనా ఉండవచ్చు గానీ.. చాలా మందికి తెలియని సంగతి మరొకటి ఉంది. ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామివారి పట్ల శ్రద్ధతో కూడిన భక్తి ఉన్న నాయకుడు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రోటోకాల్ అనుమతి ఉన్నప్పటికీ.. సాధారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్సు ద్వారా దర్శనానికి వెళతారే తప్ప.. మహద్వారం గుండా వెళ్లరు. తిరుమల దేవుడి పట్ల అంతటి అనన్యమైన విశ్వాసం ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు తిరుమల ప్రక్షాళనకు నడుం బిగిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ఆపరేషన్ తిరుమల’ చేపడుతున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల దేవదేవుడికి రాష్ట్రప్రభుత్వం తరఫున శుక్రవారం పట్టువస్త్రాలు సమర్పించారు చంద్రబాబునాయుడు. ఆగమశాస్త్రయుక్తంగా సతీసమేతంగా ఆయన దేవదేవుడికి వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆగమవిరుద్ధం అయినప్పటికీ.. గత అయిదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మాత్రమే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి వస్త్రాలను సమర్పించడాన్ని అందరూ గమనించే ఉంటారు. అయితే ఆచారాన్ని శాస్త్రసమ్మతంగా పాటించిన చంద్రబాబు, రెండోరోజు కూడా తిరుమలలోనే బసచేసి.. అనేక అంశాలపై అక్కడి అధికార్లతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. తిరుమల వ్యవహారాల ప్రక్షాళనపై ఆయన దృష్టి సారించారు.
తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికార్లను ఆదేశించారు. ప్రత్యేకించి తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి చేయడం కాకుండా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలన్నారు.
వీఐపీ సంస్కృతికి కోతపెట్టాలనే చంద్రబాబు ఆదేశాల పట్ల భక్తకోటిలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. తిరుమలలో ఇదివరకు కూడా వీఐపీలకు ప్రతిరోజూ దర్శనభాగ్యం కల్పించే వెసులుబాటు ఉండేది. అయితే అది పరిమితంగా రోజుకు ఒకటి రెండు వేల మందికి మాత్రమే ఉండేది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి అనేదానిని ఒక జంబో బోర్డుగా మార్చేశారు. బోర్డు సభ్యుల సంఖ్యనే పెంచిన జగన్.. ఆ తర్వాత ప్రత్యేకఆహ్వానితుల పేరుతో లెక్కకు మిక్కిలిగా నియామకాలు చేపట్టారు. వారందరూ కూడా దర్శనాలకు సిఫారసు ఉత్తరాలు ఇవ్వగల హోదాతో నియమితులయ్యారు. ఈ దందా కోర్టుకెక్కింది. కోర్టు జోక్యంతో ఆహ్వానితుల నియామకాలు రద్దయ్యాయి. కానీ వీఐపీ దర్శనాలకు సిఫారసు ఉత్తరాల కోటాలను పెంచేశారు. ఎమ్మెల్యేలు, బోర్డు సభ్యులు సిఫారసు చేసే కోటా పెరిగింది. రోజుకు ఏడెనిమిది వేలకు పైగా వీఐపీ దర్శన టికెట్లు కేటాయింపు జరిగేది. అసలు వీఐపీ దర్శనం అనేదానికి విలువలేకుండాపోయింది. బోర్డులోని వారితో సహా సిఫారసు ఇవ్వగల హోదా ఉన్న వారంతా వీఐపీ టికెట్లను బ్లాకులో అమ్ముకోవడం ప్రారంభించారు. ప్రతిరోజూ లక్షల్లో ఆర్జిస్తుండేవారంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్యేలు, బోర్డు సభ్యులు స్వయంగా తాము దర్శనానికి వెళుతున్నప్పుడు ఎక్కువ సంఖ్యలో మందీ మార్బలాన్ని వెంట తీసుకు వెళ్లే వీలుంటుంది. ఆ ముసుగులో అనేకమంది వైసీపీ ఎమ్మెల్యేలు నెలకోసారి దర్శనానికి వెళుతూ.. తమ వెంట రాగల అవకాశాన్ని పెద్దపెద్ద ధరలకు బ్లాకులో అమ్ముకునే వారు. ఇలాంటి అరాచకపోకడలు అనేకం జగన్ పాలనలోనే పురుడు పోసుకున్నాయి. అలాంటి సకల దుర్మార్గాలకు చరమగీతం పాడేలాగా.. అసలు తిరుమలలో వీఐపీ సంస్కృతినే పరిమితం చేయాలంటూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడి అధికార వర్గాలకు దిశానిర్దేశం చేయడం గొప్ప విషయం. వీఐపీల అనుచితమైన తాకిడి తగ్గితే.. తిరుమల భక్తులు చంద్రబాబు చిత్తశుద్ధిని అభినందిస్తారనడంలో సందేహం లేదు.