ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద సృష్టించే బీభత్సం ఎక్కడా కనిపించడం లేదు గానీ.. భారీ వర్సాల కారణంగా.. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం ప్రజాజీవితం స్తంభించిపోవడం జరుగుతోంది. లోతట్టు ప్రాంతాలు అని మాత్రమే కాదు కదా.. ఎగువ ప్రాంతాలు, సమతలప్రాంతాలలో ఉండే అనేక కాలనీలు కూడా పూర్తిగా నీటమునిగిపోతున్నాయి. నీటి ఉధృతికి చాలా కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని చోట్ల రోడ్లు మీద అడ్డంగా నీటి ప్రవాహాలు పోతుండడంతో.. రవాణా కూడా స్తంభిస్తోంది.అన్ని ప్రాంతాలూ జలమయంగానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారీ వర్షాలను అడ్డుగా పెట్టుకుని అమరావతి రాజధాని ప్రాంతం మీద విషం కక్కడానికి జగన్మోహన్ రెడ్డి దళాలు, సాక్షి కరపత్రికలు పనిచేస్తుండడం ఇప్పుడు మరీ ఘోరంగా ఉంది.
అమరావతి ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మిగిలిన ప్రాంతాలన్నీ ఖాళీగానే ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఈ భారీ వర్షాలకు అమరావతి ప్రాంతంలో అక్కడక్కడా నీళ్లు నిలవడం జరిగింది. ఇది సహజంగా ఎక్కడైనా జరుగుతుంది. అయితే.. ఆ నీటినిల్వల ఫోటోలు తీసి, డ్రోన్ విజువల్స్ సేకరించి.. సాక్షి మీడియా దళాలు తమ మార్కుగల కుటిల ప్రచారం ప్రారంభిపంచాయి. అమరావతి మొత్తం నీటమునిగిపోతున్నదని దుష్ప్రచారం సాగిస్తున్నాయి. బుడమేరు వాగు వరదకు పొంగిందని.. బుడమేరు లోని నీరంతా అమరావతి మీదికి ప్రవహించిందని.. అమరావతి మొత్తం మునిగిపోయిందని ప్రచారం సాగుతోంది. బుడమేరు వల్ల అమరావతి మునిగిపోయే సమస్య ఉన్నదని తొలినుంచి తాము చెబుతూనే ఉన్నట్టుగా మరో ప్రచారం కూడా చేస్తున్నారు.
అయితే బుడమేరు పొంగడం, బుడమేరుకు వరద రావడం ఇదంతా కూడా అబద్ధం. కేవలం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడానికి సాక్షి దళాలు ఆడుతున్న కుటిలనాటకం అని తేలుతోంది. ఈ ప్రచారం గురించి.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు లక్ష్మీశ మాట్లాడుతూ.. బుడమేరుకు వరదలు అంటూ వచ్చే వదంతులను నమ్మవద్దని కోరుతున్నారు. బుడమేరులో ప్రవాహంపై అధికారులు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారని.. విజయవాడలో అక్కడక్కడా నీళ్లు నిలిచినప్పటికీ.. అది స్థానికంగా కురిసిన వర్షాల వల్ల మాత్రమే అని ఆయన అంటున్నారు. వెలగలేరు రెగులేటర్ వద్ద నీరు విడుదల చేసేట్లయితే 24 గంటల ముందుగానే ప్రజలకు తెలియజేస్తాం అంటున్నారు. అయితే జగన్ దళాలు మాత్రం.. తమ ఇష్టమొచ్చిన రీతిలో విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నారని అర్థమవుతోంది.
