‘‘అన్నా బైలెల్లినాడో.. బెంగులూరు..
జగనన్నా బైలెల్లినాడో..’’ అని పాడుకోవడమే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకు మిగిలిఉన్న పని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటీవలి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత.. ఇప్పటికి 12వ సారిగా బెంగుళూరులోని తన యలహంక ప్యాలెస్ కు బయల్దేరి వెళ్లారు. మాంత్రికుడి ప్రాణం.. సప్తసముద్రాలకు అవతల ద్వీపంలో మర్రిచెట్టు తొర్రలో పంజరంలోని చిలకలో ఉంటుందనే సంగతి చందమామ కథలు చదువుకున్న వాళ్లకు తెలుసు. అయినప్పటికీ కూడా మాంత్రికుడు మాటిమాటికీ ఆ ద్వీపానికి వెళ్లి మర్రిచెట్టులో తన ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకుని రావడం అనేది మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డికి బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో అంతటి ఎట్రాక్టివ్ ఎలిమెంట్ ఏమున్నదో తెలియదు గానీ.. దక్కిన ఓటమి మహాప్రసాదం అనుకుంటున్నట్టుగా ఆయన పన్నెండవ సారి పయనమై వెళ్లారు.
జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు నివాసం రాజసౌధాన్ని తలదన్నేలా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. నిజానికి ఆ సౌధానికి వెళ్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జీవనశైలి కూడా రాజరికాన్ని తలపించేలాగానే ఉంటుందని పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. బెంగుళూరు వెళ్లిన తర్వాత.. ఆయన సామాన్యులను కలవడం కాదు కదా.. కొమ్ములు తిరిగిన పార్టీ నాయకులను కూడా కలవరు.
కానీ తమాషా ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి జీవితానికి, యలహంక జీవితానికి స్పష్టమైనా తేడా కనిపిస్తూ ఉంటుంది. తాడేపల్లిలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా జగన్ ఎవరినీ కలిసేవారు కాదు. అపాయింట్మెంట్ దొరకడం దుర్లభం. ప్రెస్ మీట్ లాంటివి అసలు ఊహించలేని పరిస్థితి. ఎంతగా అంటే.. ఎన్నికల సమయంలో సజ్జల రామక్రిష్ణారెడ్డి ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్ లలో మాట్లాడాలంటే జగన్ కు భయం అని కూడా చెప్పారు. అలాంటి జగన్ మాజీ అయిన తర్వాత చాలా సార్లు ఇప్పటికే ప్రెస్ మీట్ లు పెట్టారు. కానీ, ఇవన్నీ కూడా తాడేపల్లిలో ఉన్నంత వరకు మాత్రమే. ఒకసారి బెంగుళూరు వెళ్లారంటే గనుక.. భూగోళం బద్ధలైనా సరే.. జస్ట్ ట్వీట్ మాత్రమే ఉంటుంది. ఆయన తరఫున సోషల్ మీడియా దళాలు ఎవరో ఒకరు ఆ ఎక్స్ ఖాతా పనిని చేస్తుంటారు. ఏదో విహార యాత్రకు వెళ్లినట్టుగా వెళితేగనుక.. నాలుగురోజులు ఉండడం వచ్చేయడం తిరిగి పనిలో పడడం జరుగుతూ ఉంటుంది. కానీ తాడేపల్లిలో ఉన్నప్పుడు పార్టీని పునరుద్ధరించడం కోసం వరుస కార్యక్రమాలు పెట్టుకుంటూ.. బెంగుళూరు వెళ్లగానే పార్టీని, రాజకీయాల్ని సమస్తం గాలికొదిలేసి ఆయన ఎలా ఉండగలుగుతారో అనేది పార్టీ వారికి కూడా అర్థం కాదు. ఏదో తప్పనిసరిగా తాను ఎటెండ్ కావాల్సిన బిజినెస్ కార్యకలాపాలు ఉన్నట్టుగా జగన్ అతి తరచుగా బెంగుళూరు తిరుగుతుండడం ప్రజలకు మాత్రమే కాదు.. పార్టీ వారికి కూడా పెద్ద సస్పెన్స్ గా ఉంటుంది. ఇలాంటి ధోరణి వల్ల ఆయన రాజకీయాల్ని, ప్రభుత్వ చర్యల్ని, చివరకు సొంత పార్టీని కూడా నాన్ సీరియస్ గా తీసుకుంటున్నారనే భావన ప్రజల్లోకి వెళుతుందని కార్యకర్తలు అంటున్నారు.
అన్నా బైలెల్లినాడో.. బెంగులూరు..
Sunday, December 22, 2024