ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు విని జనం గగ్గోలు పెడుతున్నారు. మరో రకంగా చెప్పాలంటే భయపడుతున్నారు. భయంలోంచి జాగ్రత్త పడుతున్నారు. ముందు ముందు తమ పరిస్థితి ఏంటనే ఆలోచనతో మధనపడుతున్నారు. ఇంతకూ ముఖ్యమంత్రి ఏం అన్నారు? ‘‘రాబోయే 2024 ఎన్నికలు చాలా కీలకం. ఈ ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల పాటూ మనమే అధికారంలో ఉంటాం. అందుకోసం పార్టీలో అందరూ విభేదాలను పక్కన పెట్టి కష్టపడి పనిచేయాలి’’ అని జగన్ పిలుపు ఇచ్చారు. ఈ మాట విన్న ప్రజల్లో భయం పుడుతోంది. మరో ముప్పయ్యేళ్లపాటు ఇదే పరిపాలనను భరించాలా అని అనుకుంటున్నారు.
రాష్ట్రం ఎన్ని రకాలుగా గాడితప్పిపోయిందో ప్రజలు చూస్తున్నారు. సంక్షేమం అనే పేరుతో కొన్ని వర్గాలకు నేరుగా డబ్బు పంపడం తప్ప.. పరిపాలన అనేది గానీ, అభివృద్ధి అనేది గానీ.. రాష్ట్రంలో ఎక్కడా దుర్భిణి వేసి చూసినా కనిపించని పరిస్థితి. గ్రామాల్లో రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలు ప్రతిరోజూ అనుభవిస్తూనే ఉన్నారు. ప్రజలు చచ్చిపోవడానికి వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరగాల్సిన అవసరం లేనేలేదు.. ఆ రోడ్లలో ప్రయాణిస్తే చాలు.. అన్నట్టుగా అనేక దుర్ఘటనలు నిరూపిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన అనేది మిధ్య అయిపోయింది. ప్రభుత్వ వర్గాల్లో అవినీతి, దోపిడీ విచ్చలవిడిగా తయారయ్యాయి. వృద్ధాప్య పెన్షన్లు వంటివి ఇంటివద్దకే చేరుస్తున్నాం అని ప్రభుత్వం చాలా ఘనంగా చెప్పుకుంటుంది గానీ.. ప్రతి పెన్షనులోనూ డబ్బు లబ్ధిదారునికి ఇస్తున్నప్పుడే తమ వాటా మినహాయించుకుంటూ వాలంటీర్లు కూడా తమ స్థాయి దోపిడీకి తాము పాల్పడుతున్నారు. ఇలా సకల రకాలుగా భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలో బతుకుతున్నాం అని ప్రజలు ప్రతిరోజూ బాధపడుతున్నారు.
తన సొంత పార్టీ కార్యకర్తల కోసం జగన్ చెప్పిన మాటలు విన్న తర్వాత.. మరో ముప్పయ్యేళ్లపాటు ఇలాంటి పాలననే భరించాలా? అని సామాన్యులు జడుసుకుంటున్నారు. ఒకసారి అధికారం ఇచ్చినందుకే పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు విచ్చలవిడి అవినీతిని, దోపిడీని గమనిస్తున్న ప్రజలు.. ‘ఇంకో ముప్పయ్యేళ్లు’ అనే మాట విని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే.. ఆ పరిస్థితి తప్పదేమో అనుకుంటున్నారు.
ప్రభుత్వ అవినీతిని దోపిడీని ఎండగట్టడంలో విపక్షాలు శ్రద్ధగా, బలంగానే పనిచేస్తున్నాయి. ప్రతిపక్షాల నాయకులను నిర్బంధిస్తూ కనీసం గొంతెత్తనివ్వకుండా వారిని ఎంతగా వేధిస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు. సామాన్యుల్లో సైతం.. ప్రభుత్వంలో చిన్న అవినీతి గురించి చిన్న మాట మాట్లాడినా సరే.. వారిని రకరకాల పోలీసు కేసులతో వేధించడం ఒక రివాజుగా మార్చుకున్న వేధింపుల, విధ్వంసక ప్రభుత్వం మరో ముప్ఫయ్యేళ్లు అధికారంలోనే ఉంటుందా? అనేదే ప్రజలకు ఏవగింపు పుట్టిస్తోంది.