ఇక సిక్సర్లే: జగన్ గ్రహణం వీడింది!

Wednesday, January 22, 2025

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు జగన్మోహన్ రెడ్డి గ్రహణం వీడింది. ఇన్నాళ్లూ ఆయన కోటరీ మనుషుల చేతుల్లో బందీ అయిపోయి ఉన్న ఏపీ క్రికెట్ అసోసియేషన్ కు ఇప్పుడు విముక్తి లభించింది. నిధుల మీద కన్ను తప్ప నిర్వహణ, క్రీడాభివృద్ధి మీద ధ్యాస లేని నాయకుల చేతుల్లో ఏపీ క్రికెట్ పురోగతి నాశనం అయిపోయిన నేపథ్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను తమ గుప్పిట్లో పెట్టుకున్ని ఎపెక్స్ కౌన్సిల్ రాజీనామా చేసేస్తున్నది.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ఏసీఏ పూర్తిగా గాడి తప్పింది. విజయసాయిరెడ్డి ఈ సంస్థను తన గుత్త సంస్థలా మార్చేశారు. మొత్తం పదవులను తన బంధువులు, అనుచరులతో నింపేశారు. విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితుడు అయిన శరత్ చంద్రారెడ్డి రెండు దఫాలుగా ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఉపాధ్యక్షుడిగా సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఉన్నారు. కార్యదర్శి సాయి రెడ్డికి మిత్రుడు విశాఖకు చెందిన బట్టల వ్యాపారి గోపీనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అందరూ కూడా విజయసాయిరెడ్డి కోటరీకి చెందిన వ్యక్తులే కావడం గమనార్హం. వీరందరూ కలిసి క్రికెట్ సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని భారీగా నిధుల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడమే లక్ష్యం అన్నట్లుగా విజయవాడలో ఉండే ఏసీఏ కార్యాలయాన్ని విశాఖపట్నంకు మార్చేశారు.

ఇదిలా ఉండగా క్రికెట్ క్రీడ మీద ఏపీలో వైసిపి వారి పెత్తనం ఎంతగా సాగిందో సామాన్య ప్రజలకు కూడా అప్పట్లోనే అర్థమైంది. భారత జాతీయ జట్టుకు ఆడిన అగ్రశ్రేణి క్రీడాకారుడు హనుమ విహారి ఆంధ్ర జట్టుకు ఆడుతూ ఉంటే వైసిపి నాయకులు అతని మీద ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చి జట్టు నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేశారో ప్రజలందరికీ తెలుసు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హానుమ విహారి మళ్లీ రాష్ట్రానికి వచ్చి నారా లోకేష్ ని కలవడం, ఆంధ్ర జట్టుకు మళ్ళీ ఆడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనించాల్సిన సంగతి.

ఇప్పుడు ఎపెక్స్ కౌన్సిల్లో ఉన్న విజయ్ సాయి రెడ్డి మనుషులందరూ రాజీనామా చేయబోతున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త అపెక్స్ కౌన్సిల్ 40 రోజుల్లో గా ఏర్పడవచ్చు అని అనుకుంటున్నారు. విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్ని సారధ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పని చేసే అవకాశం ఉంది.

పాలనలో క్రీడాభివృద్ధికి ఏదేదో చేసేస్తున్నట్టుగా సుదీర్ఘ ప్రహసనం నడిపించారు అప్పట్లో జగన్. అయితే వాస్తవంలో క్రీడాభివృద్ధిని, క్రికెట్ ను కూడా సర్వనాశనం చేశారు. ఇప్పుడు కొత్తగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పడటం వలన ఆంధ్ర క్రికెట్ కు మంచి రోజులు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో అన్నీ సిక్సర్లే ఉంటాయని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles