అనంత’ నోట ఎన్నికల మాట: ఏంటి సంకేతం?

Friday, December 5, 2025

ఇటీవల ధర్మవరంలో పర్యటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున దూతలుగా వచ్చారో లేదా, తమంత తాముగా పరామర్శించాలనే ఉద్దేశంతో వచ్చారో తెలియదు గానీ.. అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇద్దరూ కలిసి.. రాజమహేంద్రవరం వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి అక్కడ జైల్లో రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను ములాఖత్ లో కలిసి ధైర్యం చెప్పారు. తర్వాత మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని తమ సహజశైలిలో నానా తిట్లు తిట్టారు. అవన్నీ పక్కన పెడితే.. అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘మేం దమ్మున్నవాళ్లం.. మాది దమ్మున్న పార్టీ.. ఎన్నికలు పెడితే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ రెచ్చిపోవడం ఇప్పుడు రకరకాల చర్చలకు కారణం అవుతోంది. అనంత నోట ఎన్నికల మాట ఉత్తినే వచ్చినది కాదని.. దాని వెనుక పరమార్థం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నికలు పెడితే తేల్చుకోవడానికి సిద్ధం అని ప్రగల్భాలు పలుకుతున్న అనంత వెంకట్రామిరెడ్డికి.. కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయి ఇంకా వారం రోజులు కూడా కాలేదనే సంగతి గుర్తున్నట్టు లేదు. కాకపోతే.. ఆయన మరో ఉద్దేశంతోనే ఎన్నికల ప్రస్తావన చేశారనే మాటలు వినిపిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక చిత్రమైన ఆలోచన చేస్తున్నట్టుగా పార్టీలో గుసగుసలున్నాయి. కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలను దారుణంగా ఓడిపోయిన తర్వాత.. పరువు కాపాడుకోవడం ఎలా? అనే మీమాంసలో జగన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఆయన వివిధ ప్రాంతాల్లో యాత్రలు నిర్వహిస్తూ.. ఇరుగు పొరుగు జిల్లాలనుంచి కూడా తోలించిన జనాన్ని తమ టీవీ ఛానెళ్లలో చూపించుకుంటూ.. తాను ఇంట్లోంచి కాలు బయటపెడితే చాలు.. జనం తనకోసం వెల్లువలా వస్తున్నారని.. కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి సాగనంపాలా అని ఎదురుచూస్తున్నారని అంటుంటారు. ప్రతిసారీ అదే మాటలు అంటున్నారు. కానీ రెండు ఓటముల తర్వాత.. అదే మాట అంటే జనం నవ్వుతారేమో అనే భయం ఆయనలో మొదలైనట్టుంది.

అందుకే తనకు ప్రజాబలం ఉన్నదని నిరూపించుకోవాలంటే.. గట్టి ఎన్నికలనే ఎదుర్కోవాలి. అందుకోసం జగన్ తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేసేసి.. ఉప ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇలాంటి ఎత్తుగడనే అనుసరించారు. ఇప్పుడు కూడా ప్రజాబలం ఉన్నదని చెప్పుకోవడానికి.. ఎన్నికలొక్కటే మార్గం అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలోచనపై మిథున్ రెడ్డి అభిప్రాయం కూడా తెలుసుకోవడానికి సీనియర్ నాయకుడిగా అనంత వెంకట్రామిరెడ్డిని పంపినట్టుగా తెలుస్తోంది. అందుకే అనంత నోట ‘ఎన్నికలు పెడితే తాము తేల్చుకోవడానికి సిద్ధం’ అని మాట వచ్చిందని అంతా అనుకుంటున్నారు. అయితే జగన్ ఎమ్మెల్యేలో మాత్రమే రాజీనామా చేయిస్తారా? ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తారా? అనే చర్చ కూడా ప్రజల్లో జరుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles