విశాఖ నగర కార్పొరేషన్ పరిధిలో స్థాయి సంఘం ఎన్నికను గెలిచినంత మాత్రాన ఎమ్మెల్సీ ఎన్నికను కూడా గెలిచినట్లేనా? వైసీపీలో జగన్ తరువాత అంతటి అహంకార పూరితమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న బొత్స సత్యనారాయణకు మరోసారి దారుణ పరాజయం రుచి చూపించడానికి ఎన్డీయే కూటమి రంగం సిద్ధం చేసేసిందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
విశాఖ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికలు గెలిచిన తరువాత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్ లో వ్యక్తం చేసిన కాన్ఫిడెన్స్ గమనిస్తే అలాగే ఉంది. 66 ఓట్ల మెజారిటీ తో నెగ్గిన ఈ ఎన్నిక మాత్రమే కాదు. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా కూడా.. కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన అంటున్నారు. విశాఖ కార్పొరేషన్ స్థాయి సంఘం ను గెలుచుకోవడం వెనుక కీలకంగా చక్రం తిప్పిన నాయకుల్లో గంటా కూడా ఉన్నారు.
ప్రత్యర్థి జట్టు నుంచి.. వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ తదితరులు.. తమ కార్పొరేటర్లు జారిపోకుండా ఎంత కష్టపడినపటికీ ఫలితం దక్కలేదు.
ఇప్పుడు బొత్స మరియు జగన్ మాట్లాడుతున్న నైతిక విలువల గురించి గంటా ఎద్దేవా చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసిపి వారు టీడీపీ అభ్యర్థులను ఎలా బెదిరించి నామినేషన్లు వేయనివ్వకుండా చేసి గెలిచారో ప్రజలు అందరికీ తెలుసు అని గంటా గుర్తు చేస్తున్నారు.
వైసీపీలో ఇక భవిష్యత్తు లేదనే నమ్మకంతో బయటకు వస్తున్న వారి ఓట్లతోనే టీడీపీ ఎమ్మెల్సీ స్థానం గెలవాలని అనుకుంటోంది. ఈ విషయంలో గంటా కాన్ఫిడెన్స్ ప్రత్యర్థులను భయపెట్టేలా ఉన్నదని పలువురు అంటున్నారు.