సాకులు ఏమైనా చెప్పవచ్చు గాక.. కానీ 11వ తేదీ మొదలుకాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గానీ, ఆయన పార్టీ ఎమ్మెల్యేలుగానీ హాజరు కాబోవడం లేదు. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలకు ఒక గొప్ప సందేహం తలెత్తుతోంది. జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా తన పరిపాలన కాలంలో పెట్టిన రూల్స్ ను కనీసం ఆయనైనా పాటించాలి కదా అని ప్రజలు అనుకుంటున్నారు. అసెంబ్లీ హాజరు కాకుంటే ఎమ్మెల్యేగా జీతం తీసుకునే అర్హత ఆయనకు ఉంటుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు ప్రతి ఏడాది పదిహేను వేలు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. కానీ అమ్మఒడి లబ్ధి పొందడానికి ఒక రూలు పెట్టారు. విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు ఎటెండ్ అవుతూ ఉండాలి. ఏడాదిలో కనీసం 75 శాతం ఎటెండెన్స్ ఉంటే తప్ప అమ్మ ఒడి పథకం వర్తించదు. అటెండెన్స్ లేకపోతే.. వారి పేర్లను అమ్మఒడి లబ్ధి పొందే జాబితాలోంచి తొలగించేస్తారు. నిజానికి పిల్లలు బడికి క్రమం తప్పకుండా వచ్చేలా చూడడానికి ఇది మంచి నియమమే.
కానీ అలాంటి నియమం జగన్మోహన్ రెడ్డి తన జీవితానికి కూడా పెట్టుకోవాలి కదా. ఆయన ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే యొక్క ప్రాథమిక డ్యూటీ శాసనసభ సమావేశాలకు హాజరుకావడమే కదా? 75 శాతం శాసనసభ ఎటెండెన్స్ లేకపోతే.. ఆయనకు జీతం ఇవ్వబోం అని ఒక రూలు ఉండాలి. అప్పుడే జగన్ బుద్ధిగా అసెంబ్లీకి వస్తారు.. అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి కి శాసనసభకు వెళ్లే ఉద్దేశం లేనప్పుడు.. ఆయన తన ఎమ్మెల్యే వేతనాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలు అంటున్నారు. అసెంబ్లీకి వెళ్లని వాళ్లు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే అని ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తున్నారు. సభకు వెళ్లే ఉద్దేశం లేకపోతే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాల్సిందే అని షర్మిల సలహా ఇస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేని వారు అసలు ఏ పదవుల్లోనూ ఉండకూడదని షర్మిల అంటున్నారు.
కనీసం అమ్మఒడి పథకానికి పెట్టిన రూల్సు లాగా అటెండెన్స్ లేకుంటే లబ్ధి ఉండదనే రూలును జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా పాటిస్తే ఎంత బాగుంటుందో కదా అని ప్రజలు అంటున్నారు.
అమ్మ ఒడి’ రూల్ జగన్ కు వర్తించదా?
Monday, January 27, 2025