మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన సొంత గోడు తప్ప ప్రజల ప్రయోజనాల మీద ఏ మాత్రం ఆసక్తి లేదు అని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా కావాలని దరఖాస్తు చేసుకోవడం, తన భద్రతకు సీఎం స్థాయి సెక్యూరిటీ ఏర్పాట్లు ఉండాలని కోర్టులో పిటిషన్ వేయడం.. సహా అంతా తన గోడు వెళ్ళబోసుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం ఆయన మానేశారని విమర్శలు ప్రజల్లో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి జరిగిందేమిటో ప్రజలకు తెలిస్తే మళ్లీ జగన్ పట్ల చులకన భావమే ఏర్పడుతుందని.. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకంపై జగన్ పేరును మాత్రమే కొందరు వ్యక్తులు చెరిపివేయగా, ఏకంగా మహనీయుడు అంబేద్కర్ మీద చంద్రబాబు నాయుడు దాడి చేయించారంటూ ఒకరకమైన అబద్ధపు ప్రకటనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ చెలరేగిపోతుండడం ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
అంబేద్కర్ మీద జాడి దాడి జరిగిందో లేదో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. కేవలం తమ చేతిలో ఒక కరపత్రం పెట్టుకుని దాని ద్వారా అంబేద్కర్ పట్ల తెలుగుదేశం ప్రభుత్వం అవమానకరమైన రీతిలో ప్రవర్తించింది అంటూ అబద్దాలను వండి వార్చడానికి వారు ప్రయత్నిస్తే నమ్మడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు. వారి మాటలు నమ్మేట్లయితే ఆ పార్టీ ఓడిపోయి ఉండేదే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డికి తొలినుంచి కూడా తనకు జరిగిన అవమానం గురించి రాష్ట్రానికి మహా నాయకులకు జరిగినట్టుగా అబద్ధాలను పులిమి ప్రచారం చేయడం అనేది అలవాటు.
ప్రభుత్వ కార్యాలయాల మీద జగన్ బొమ్మలను కొత్త ప్రభుత్వం వచ్చాక కొందరు వ్యక్తులు తొలగిస్తే.. ప్రభుత్వ ఆస్తుల మీద దాడిజరిగినట్టుగా విధ్వంసం జరిగినట్టుగా ప్రచారం చేయడంలో జగన్ ఆరితేరిపోయారు. అదే సూత్రం ఇక్కడ కూడా వాడుతున్నట్టున్నారు. తన పేరు చెరపివేశారని ఏడిస్తే.. ప్రజలు నవ్వుతారని.. తన మీద జాలి పుట్టడానికి బదులుగా నవ్వులపాలు అవుతామని జగన్ కు తెలుసు. అందుకే అంబేద్కర్ కు ద్రోహం అంటూ యాగీ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
ముసుగు అంబేద్కర్ ది.. ఆక్రోశం జగనన్నది!
Friday, December 5, 2025
