అమరావతి రాజధాని పనులు శరవేగంగా టాప్ గేర్ లో సాగబోతున్నాయి. ఇప్పటికే 37 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులకు వచ్చేనెల ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబునాయుడు ఇవాళ ప్రధానిని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఏప్రిల్ నెలలో కొన్ని మంచి ముహూర్తాలను ఎంపిక చేసి.. వాటిలో ప్రధానికి అనువైన తేదీన కార్యక్రమం ఏర్పాటుచేసే ఆలోచనతో ఆయన ఢిల్లీ వెళ్లారు. అదే సమయంలో అమరావతి అభిమానులకు మరో శుభవార్త కూడా వస్తోంది. రాజధానికి వన్నెతెచ్చే ఐకానిక్ భవనాలుగా భావిస్తున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే ఈ పనులు కూడా షురూ అవుతాయి.
ఈ రెండు భవనాలకు సంబంధించి.. 17వ తేదీ సాయంత్రం టెండర్లు దాఖలు చేయడానికి తుదిగడువుగా నిర్ణయించారు. అసెంబ్లీ నిర్మాణానికి 768 కోట్లు, హైకోర్టు భవనాల నిర్మాణానికి 1048 కోట్ల అంచనా వ్యయాలతో సీఆర్డీయే టెండర్లు ఆహ్వానించింది. గడువు ముగిసే సమయానికి ఈ నిర్మాణాలకు కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఎన్‌సీసీ, ఎల్ అండ్ టీ సంస్థలు టెండర్లు వేశాయి. వీటిని ప్రస్తుతం రెండో కమిటీకి నివేదించారు. సాంకేతిక బిడ్లను మాత్రమే ఇప్పుడు తెరిచారు. రెండో కమిటీ కూడా ఆమోదించిన తర్వాత.. ఈ సంస్థల ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తారు. ఎల్ 1 గా నిలిచిన ఏజన్సీకి టెండరు కట్టబెడతారు. ఒకసారి టెండర్లు ఓకే అయిన తర్వాత.. ఇక వెనువెంటనే.. నిర్మాణ పనుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
అసెంబ్లీ భవనాన్ని 103.76 ఎకరాల స్థలంలో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. బేస్ మెంట్, గ్రౌడ్ ఫ్లోర్ తో పాటు, మూడు అంతస్తుల్లో ఉండేలా డిజైన్లు రూపొందాయి.
హైకోర్టు విషయానికి వస్తే.. 42.36 ఎకరాల్లో.. 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం కానుంది. బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్ కలిపి మొత్తం ఏడు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అమరావతికే వన్నె తెచ్చే నిర్మాణాలుగా వీటిని భావిస్తున్నారు. ఈ నిర్మాణాలకు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే శ్రీకారం చుట్టారు. కాకపోతే.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. అమరావతిని మొత్తం మరుభూమిగా మార్చేసే కుట్ర చేశారు. కోర్టు తీర్పులను కూడా నిర్లక్ష్యం చేశారు. జగన్ కుట్రల వలన వందల కోట్ల నిర్మాణ భారం పెరిగినప్పటికీ.. కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో అమరావతి నిర్మాణ పనులను పూర్తిచేస్తున్నది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పనులకు మూడేళ్ల డెడ్ లైన్ విధించారు. కాగా, ఈ హైకోర్టు, అసెంబ్లీ ఐకానిక్ భవనాలు.. మరికొంత వ్యవధిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది.
అమరావతి ఐకానిక్ భవనాలు త్వరలోనే షురూ!
Friday, December 5, 2025
