కీలకమైన పనులకు అవసరమైన నిధులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. చిట్టడివిలాగా, స్మశానం లాగా మారిపోయిన వేల ఎకరాల రాజధాని ప్రాంతం జంగిల్ క్లియరెన్స్ తర్వాత నిర్మాణాలకు అనువుగా అందివస్తున్నది. నీటిమడుగుల్లో ఐదు సంవత్సరాల పాటు మగ్గిపోయేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గమైన కుట్ర చేసినప్పటికీ అప్పట్లో ఎంతో పటిష్టంగా నిర్మించిన పునాదుల మీదనే ఐకానిక్ భవనాలను నిర్మాణాలను కొనసాగించడానికి నిపుణుల నివేదికలు మద్దతు ఇస్తున్నాయి. ఇలా అన్ని రకాలు గా అమరావతి రాజధాని స్వప్నాన్ని సాకారం చేయడానికి శుభ శకునాలు ఏర్పడుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం అన్‌స్టాపబుల్ ప్రాజెక్టుగా పరుగులు తీస్తుందని తెలుగు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తొలి విడత పాలన సాగించిన రోజులలో అమరావతి ప్రాంతంలో మూడు ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంకల్పం తీసుకుంది. వీటిలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు ఉన్నాయి. బహుళ అంతస్థల ఆకాశ హర్మ్యంగా సచివాలయ భవనానికి, బౌద్ధ స్తూపం గుర్తుకు చేసే డిజైన్లను హైకోర్టు భవనానికి చంద్రబాబు నాయుడు సిద్ధం చేయించారు. తొలి ప్రభుత్వంలోనే ఈ రెండింటికీ పునాదులు కూడా వేశారు. అప్పట్లో పునాదుల కోసమే 330 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టారు. శాసనసభతో కలిపి ఈ మూడు ఐకానిక్ భవనాల నిర్మాణానికి సుమారు 12 వేల కోట్ల రూపాయల అంచనాలతో డిజైన్ సిద్ధం చేశారు. లండన్ కు చెందిన విశ్వవిఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ డిజైన్లను రూపొందించింది.
ఐదేళ్లపాటు అమరావతిని సర్వనాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్న నేపథ్యంలో- అప్పుడు సగం చేసిన పనులు, అప్పుడు వేసిన పునాదులు ఇప్పటికీ పనికొస్తాయా లేదా? వాటి మీదనే కొనసాగించవచ్చునా లేదా? అనే సందేహాలు కొత్త ప్రభుత్వానికి ఏర్పడ్డాయి! అయితే ఐఐటీ నిపుణులు భరోసా ఇవ్వడంతో పాత డిజైన్ల ప్రకారమే నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్స్టీరియర్ డిజైన్ పూర్తిగా పాతరూపులోనే ఉంటుంది. ఇంటీరియర్ లో మాత్రం ఆధునిక సదుపాయాలకు తగినట్లుగా కొన్ని మార్పు చేర్పులు చేయాలని నిర్ణయించారు. అందుకోసం మళ్లీ నార్మన్ ఫోస్టర్ సంస్థ కన్సల్టెన్సీ సేవలను వినియోగించుకోబోతున్నారు. ఇంచుమించుగా డిసెంబర్లో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఈ డిసెంబర్లోనే విశాఖలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని కూడా అనుకుంటున్నారు. అలాగే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టి, 2027 సంవత్సరాంతానికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. కేంద్రం ఇప్పటికే కొంత నిధులు కూడా విడుదల చేసింది. నిర్దిష్ట గడువుల్లోగా పూర్తి చేస్తేనే ఆ తర్వాతి నిధులు విడుదల చేస్తామంటూ కేంద్రం నిబంధనలు విధిస్తున్న నేపథ్యంలో పోలవరం పనులు కూడా అన్ స్టాపబుల్ గా సాగిపోయే అవకాశం ఉంది. రైల్వే జోన్ విషయంలో సందేహమే అక్కర్లేదు. అది పూర్తిగా కేంద్రం వ్యవహారమే గనుక, రైల్వేకు నిధుల కొరత లేదు కనుక ఏకబిగిన ఆ పనులు సాగుతాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే అమరావతి రాజధాని నిర్మాణం కూడా అన్‌స్టాపబుల్ గానే సాగిపోతుందని అందరూ అంచనా వేస్తున్నారు.