తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సుదీర్ఘమైన పాదయాత్ర నిర్వహించి ఈ ఎన్నికలలో పార్టీ అపురూపమైన ఘన విజయం సాధించడంలో కీలక భూమిక పోషించిన నారా లోకేష్ కొత్త మంత్రివర్గంలో ఉండబోతున్నారా? లేదా? అనే విషయంలో సస్పెన్స్ తొలగిపోయింది. ఆయనను మంత్రి పదవిలోకి తీసుకుని ప్రభుత్వ కీలక నిర్ణయాలలో భాగస్వామ్యం ఉండేలా చూడాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి- అమరావతి రాజధాని పురోగతితో ముడిపడి ఉన్న ఒక కీలక శాఖను నారా లోకేష్ కు అందించబోతున్నట్లుగా తెలుస్తోంది!
చంద్రబాబు నాయుడు తన కలల రాజధానిగా అమరావతిని ఎంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే, ప్రపంచమంతా కూడా మన రాష్ట్రం వైపు తలతిప్పి చూసే స్థాయిలో ఒక అద్భుతమైన రాజధాని నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఆయన సంకల్పానికి ఆ ప్రాంత రైతులు అద్భుతంగా స్పందించారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ప్రభుత్వ మీద ఎలాంటి భారం పడకుండా 55 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు సేకరించారు. నగరం ఎలా ఉండాలో డిజైన్లు సిద్ధం చేయించారు. నిర్మాణాలను ప్రారంభించారు. ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇతర ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల క్వార్టర్ల భవనాలు నిర్మాణం 80^90 శాతం వరకు పూర్తయ్యాయి కూడా! అదే విధంగా ఆకాశ హర్మ్యంలాగా సెక్రటేరియట్ భవనానికి శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించారు. ఇంకా అనేక నిర్మాణాలు వివిధ దశలో అమరావతి ప్రాంతంలో ఉన్నాయి. సమాంతరంగా మౌలిక వసతుల కల్పన, భూగర్భ డ్రైనేజీ, భూగర్భ కేబుల్ వ్యవస్థ వీటన్నింటినీ కూడా చేపడుతూ వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.
ఈలోగా ఎన్నికలు వచ్చాయి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అమరావతి అనే తెలుగు ప్రజల స్వప్నాన్ని ఏరకంగా సర్వనాశనం చేశారో ప్రజలందరికీ తెలుసు. మూడు రాజధానులు అనే మాయమాటలతో మూడు ప్రాంతాల ప్రజలని సమానంగా మోసం చేసిన చరిత్రను జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నారు. అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ ప్రజల ఎదుటకు ఎన్నికల సమరానికి వెళ్లి ఘన విజయాన్ని సాధించారు చంద్రబాబు. ఇప్పుడు ఎక్కడైతే రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారో.. అదే స్థలంలో పదవీ స్వీకార ప్రమాణం కూడా చేయబోతున్నారు. ఈసారి రెట్టించిన వేగంతో రాజధాని నిర్మాణ పనులను కొనసాగించాలని ఐదేళ్ల ప్రభుత్వ కాలవ్యవధిలోగా నగరానికి ఒక రూపు తీసుకురావాలని చంద్రబాబు సంకల్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణం పట్ల తనతో సమానమైన ఆసక్తి శ్రద్ధ పట్టుదల ఉన్న వారి చేతిలో నిర్మాణాలతో మునిపడిన కీలక మంత్రిత్వ శాఖను పెట్టాలని ఆయన ఆలోచనగా ఉంది. అందుకే తన కొడుకు నారా లోకేష్ చేతిలో అటువంటి ఇంపార్టెంట్ మంత్రిత్వ శాఖ పెడతారని అంటున్నారు. పైగా నారా లోకేష్ అమరావతి రాజధాని ప్రాంతానికే చెందిన మంగళగిరి నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో రాజధాని నిర్మాణంపై ఆయనకు మరింత బాధ్యత ఉంటుందని నగరం త్వరగా పూర్తవుతుందని ప్రజలు నమ్ముతున్నారు.
అమరావతి రిలేటెడ్ గా లోకేష్ కు మంత్రి పదవి!
Thursday, November 21, 2024