55 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు స్వచ్ఛందంగా అందించిన తర్వాత- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా.. ప్రపంచం యావత్తూ తల తిప్పి చూడవలసిన అద్భుత నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అమరావతి నగర విశ్వరూపం అనేది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే అమరావతిని మరింత భారీ స్థాయి నగరంగా మెగా రాజధానిగా రూపొందించడానికి మరో నలభై నాలుగు వేల ఎకరాలు కూడా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు ముందుకు వచ్చే నాలుగు మండలాల్లోని 11 గ్రామాలలో ఈ భూసేకరణ చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి కొందరు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తుండడం వల్ల ఈ అంశం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు సర్కారు చేస్తున్న కృషి అమరావతిని విశ్వరూపనగరం గా తయారు చేస్తుందని ప్రజలు అంటున్నారు.
పైసా ఖర్చు చేయకుండా, ప్రభుత్వ ఖజానా మీద ఎలాంటి భారం పడకుండా రాజధాని నిర్మాణం కోసం 55 వేల కోట్ల ఎకరాల భూములను సమీకరించారు. గత ప్రభుత్వ కాలంలో చంద్రబాబు నాయుడు కీలకమైన నిర్మాణాలకు ను ప్రారంభించారు కూడా. అధికారుల క్వార్టర్లు, జడ్జిల క్వార్టర్లు వంటి నిర్మాణాలు 70 శాతం వరకు పూర్తయ్యాయి కూడా. అయితే అలాంటి దశలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే తెలుగు ప్రజల స్వప్నాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. రైతుల త్యాగాలను తుంగలో తొక్కి అమరావతి ప్రాంతాన్ని మరుభూమిగా మార్చడానికి సిద్ధపడ్డారు. ఐదేళ్ల పాలన కాలంలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా దుర్మార్గం చేశారు. సగంలో ఆగిన నిర్మాణాలన్నింటినీ సత్వరం పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించిన తరువాత కూడా జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. మూడు రాజధానుల మాయతో రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు.
తిరిగి ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని పనులు ముమ్మరంగా ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం 50 వేల కోట్ల రూపాయల విలువైన పనులు పునఃశంకుస్థాపనలకు సిద్ధం అవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్, మెట్రో వంటి అనేక హంగులు సమకూరుతున్నాయి. వందల సంస్థలు అమరావతిలో ఏర్పాటు కావడానికి ఇప్పటికే తమ తమ పనులు ప్రారంభిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒప్పందాలు కుదిరిన సంస్థలన్నీటికి స్థలాలు కేటాయించగా మిగిలేది గరిష్టంగా 2000 ఎకరాలు మాత్రమే అని ప్రభుత్వం లెక్క తేల్చింది.
ఇప్పటికీ అమరావతిలో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి స్థలాలు ఇవ్వాలని కొత్తగా అనేక సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నా యి. దీంతో నగర విస్తీర్ణాన్ని పెంచాలని, సుముఖంగా ఉండే రైతుల నుంచి స్థలాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కొత్తగా మరో 44వేల ఎకరాల భూములను సమీకరించాలని అనుకుంటున్నారు. అదే జరిగితే అమరావతి రాజధాని అనేది విశ్వ నగరంగా అనే దశ నుంచి విశ్వరూప నగరంగా ఏర్పాటు అవుతుందని ప్రజలలో ఆశాభావం వ్యక్తం అవుతోంది.