కాపు జాతి ఉద్యమ నేత గా తనను తాను అభివర్ణించుకునే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి తన ప్రాణాలొడ్డి పనిచేస్తానని, రాష్ట్రంలోని కాపు జాతిని మొత్తం ఏకం చేస్తానని ప్రగల్భాలు పలికిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు పూర్తిగా లూప్ లైన్ లో ఉన్నారు. ఆయన ఇప్పటిదాకా కేవలం రెండో మూడో ప్రెస్ మీట్ లు మాత్రం నిర్వహించారు. అది కూడా ఆయన తనంతగా తాను జగన్ గుడ్ లుక్స్ లో పడడానికి, చంద్రబాబునాయుడు పవన్ కల్యాణ్ లను తిట్టడానికి నిర్వహించారు. ఆయన ప్రస్తుతం తనను పార్టీ వాడుకోవడం లేదని మధనపడిపోతున్నట్టుగా తెలుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేసే వారి జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి విడుదల చేశారు. వారందరూ కూడా.. సామాన్యులు. జగన్ పథకాల ద్వారా లబ్ధి పొంది, జగన్ పథకాల గురించి ప్రజలకు చెప్పగల వారు మాత్రమే అని.. ఆయన ప్రకటించారు! సామాన్యులే తమ పార్టీకి ప్రచారసారథులని చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు ముద్రగడ పద్మనాభం బాధ కూడా అదే. తనను కూడా స్టార్ క్యాంపెయినర్ హోదాతో పార్టీ వాడుకుంటే బాగుండును కదా.. అని ఆయన సన్నిహితులతో మధనపడిపోతున్నారట. నేను అందుకు కూడా పనికిరానా జగన్ గారూ అని ఆవేదన చెందుతున్నారట. కాపులందరినీ తాను ఏకం చేయగలననే నమ్మకంతో తనను రాష్ట్రమంతా తిప్పి వాడుకుంటారని ముద్రగడ ఆశపడ్డారు. తన వల్ల కాపు ఓట్లు ఎన్ని వైసీపీకి పడతాయి అనే సంగతి పక్కన పెడితే.. అలా తిరగడం వలన రేపు పార్టీ గెలిస్తే.. ఆ విజయంలో తనకు కూడా భాగం ఉన్నదని చెప్పుకోవచ్చునని.. కాపు ఓట్లు తన వల్లే పడ్డాయని చెప్పుకుంటూ రాజ్యసభ ఎంపీ పదవిని డిమాండ్ చేయవచ్చునని ముద్రగడ భావించినట్టు సమాచారం. అయితే.. జగన్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టారు. పార్టీలో చేర్చుకున్నారే.. తప్ప ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా కూడా పనికిరానా అంటూ పద్మనాభం దిగులుపడుతున్నారని ఆయన సన్నిహితుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
నేను అందుక్కూడా పనికిరానా : ముద్రగడ ఆవేదన!
Sunday, December 22, 2024