ఎన్నికల సందర్భంగా అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కేసు నమోదు అయితే ఆ కేసును కొట్టివేయాలంటూ సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన న్యాయపరంగా తనకున్న హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ పిటిషన్ వేయడంలో ఆయన సంజాయిషీ కూడా అహంకారపూరితంగానే ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసు నమోదు అయిన కారణం ఒకటి కాగా- మరో రకమైన వివరణతో కోర్టును మభ్యపెట్ట చూస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
నంద్యాలలో తన మిత్రుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ పోలింగుకు రెండు రోజుల ముందు వెళ్లారు. ఈ కేసు ఆయన రాకకు సంబంధించినదే. నంద్యాల రావడానికి అల్లు అర్జున్ ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు కేసు పెట్టారని అయితే తాను కేవలం స్నేహితుడి ఇంటికి అభినందనలు తెలియజేయడానికి వెళ్లానే తప్ప అందులో రాజకీయం లేదని అల్లు అర్జున్ అంటున్నారు. బహిరంగ సభ నిర్వహించే ఉద్దేశం తనకు లేదన్నారు. వ్యక్తిగత సందర్శన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని అందువలన తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని అర్జున్ అంటున్నారు.
ఆయన కోర్టులో ఎలాంటి మాయమాటలైనా చెప్పవచ్చు గాని.. వాస్తవానికి జరిగింది వేరు! నగర పొలిమేరల నుంచి వేల మందితో పెద్ద ఊరేగింపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో ఊరేగుతూ అల్లు అర్జున్ వెళ్లడం ఆ రోజే వివాదాస్పదం అయింది. పోలీసులు ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోయారని విమర్శలు కూడా వచ్చాయి. వ్యక్తిగత పర్యటన అంటే ఏదో స్నేహితుడి ఇంటికి వెళ్లిపోయి అభినందించి వెళ్ళిపోవడం లాగా అది జరగలేదు. పర్యటన వ్యక్తిగతమైనా రాజకీయేతరమైనా సరే ర్యాలీ రూపంలో జరగడం అనేది ఆ రోజు నాటికి నిషిద్ధం. ఆ సంగతి అల్లు అర్జున్ కు బాగా తెలుసు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన మిత్రుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి కి కూడా బాగా తెలుసు. కానీ అల్లు అర్జున్ ద్వారా రాగల రాజకీయ మైలేజీ కోసం మాత్రమే వారు ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ తీశారు- అనేది అందరూ గుర్తించారు. కేసు కూడా ర్యాలీ మీద నమోదయింది. కానీ అల్లు అర్జున్ కు మిత్రుడిని గెలిపించే అంత సీన్ లేదని ఎన్నికలు నిరూపించాయి.
తీరా ఇప్పుడు తాను వెళ్ళినది ఎన్నికల పర్యటన కాదని, వ్యక్తిగత పర్యటన గనుక ఈ కేసును కొట్టేయాలని అర్జున్ హైకోర్టును అడుగుతున్నారు. కనీసం ఆరోజు ర్యాలీతో తనకు సంబంధం లేదని తన ప్రమేయం లేకుండా అభిమానులు రావడం వలన అలాంటిది జరిగిందని ఆయన ఒక మాట సంజాయిషీ చెప్పి ఉంటే ఈ పిటిషన్ లో బాగుండేది. కేసు నుంచి ఆయన బయటపడే అవకాశాలు మెరుగయ్యేవి. కానీ సంజాయిషీ కూడా అహంకారపూరితంగా చెప్పారని విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నా యి.
అల్లు అర్జున్: సంజాయిషీ కూడా అహంకారపూరితమే!
Saturday, November 23, 2024