కాకినాడ పురపాలికపై కూటమి జెండా!

Monday, September 16, 2024

గెలుపోటములను నాయకులు సమానంగా తీసుకోగలరు.. ఓడిన వాళ్లు తర్వాతి ఎన్నికల్లో మనకు అవకాశం దక్కుతుందని ఎదురుచూడగలరు. కానీ.. 151 నుంచి ఏకంగా 11కు పడిపోయిన జగన్ పట్ల ప్రజల్లోని వ్యతిరేకతను చూసి, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు. ఇప్పుడే ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతే.. కనీసం తమ రాజకీయ భవిష్యత్తు అయినా బాగుంటుందని ఎవరికి వారు ప్రయత్నాల్లో ఉన్నారు. వైసీపీలో ఎమ్మెల్యే స్థాయిలో ఉంటూ ఓడిపోయిన, గెలిచిన వారికి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. అదే సమయంలో మునిసిపాలిటీల విషయంలో రకరకాలుగా సమీకరణాలు మారుతున్నాయి. తాజా పరిస్థితులను గమనిస్తే.. కాకినాడ మునిసిపాలిటీ కూడా తెలుగుదేశం పరం కాబోతున్నట్టుగా కనిపిస్తోంది.

వైసీపీకి భవిష్యత్తు కూడా ఉండదనే భయం ఏర్పడుతుండడంతో.. చిన్సస్థాయి నాయకులు, కౌన్సిలర్ స్థాయిలోని వారు ముందుగా జాగ్రత్త పడుతున్నారు. పుంగనూరులో కొందరు కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరిపోయిన సంగతి తెలిసింది. తర్వాత వారి మీద వత్తిడి వచ్చింది. అదే సమయంలో.. పులివెందులలో కూడా కొందరు కౌన్సిలర్లు జగన్ మాట మీద అనేక కాంట్రాక్టు పనులు చేస్తే.. ఒక్క బిల్లు కూడా ఇవ్వలేదని.. బిల్లులు రావాలంటే తెలుగుదేశంలో చేరడమే మేలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. పులివెందుల మునిసిపాలిటీపై తెదేపా జెండా ఎగిరితే పరువు పోతుందనే భయంతో.. ఎంపీ అవినాష్ రెడ్డి వారందరినీ బుజ్జగించినట్టుగా తెలుస్తోంది.

కానీ ఇప్పుడు కాకినాడ మునిసిపాలిటీ వంతు వచ్చింది. ఇక్కడ 27 వార్డుల్లో ఒకే తెదేపా కౌన్సిలరు ఉన్నారు. మిగిలిన వారిలో 13 మంది వరకు వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వైసీపీ నాయకులు వారిస్తున్నా వినకుండా వీరు మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి తాము పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకున్నారు. 13 మంది పార్టీ మారితే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దుర్గేష్ కు కూడా ఓటు హక్కు ఉంటుంది గనుక.. మునిసిపాలిటీ ఛైర్మన్ పదవి కూడా కూటమికి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి కాకినాడ మునిసిపాలిటీ వైకాపాలోని అంతర్గత రాజకీయాలతో పాటూ, ఆ పార్టీకి భవిష్యత్తు లేదనే నమ్మకం కారణంగా.. ఇప్పుడు మునిసిపాలిటీ ఏకంగా కూటమి పరం అయ్యేలా కనిపిస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles