సంకల్ప శుద్ధి ఉంటే.. ఏ కార్యమైనా చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. ఈ విషయం పర్సనాలిటీ డెవలప్మెంట్ బోధకులు పదేపదే చెబుతుంటారు. ‘గట్టిగా అనుకో- అయితది’ అనే ఫిదా సినిమా డైలాగు కూడా చెప్పే నీతి మాత్రం ఇదే. చంద్రబాబునాయుడు.. ప్రపంచం తలతిప్పి చూసేలా.. ఒక అద్భుత రాజధాని నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానుకగా అందించాలని అనుకున్నారు గనుకనే.. అమరావతి ఆలోచన పురుడు పోసుకుంది. ఆ అద్భుతాన్ని ఆవిష్కరింపజేయడానికి ప్రజల మీద భారం మోపకూడదనే ఉద్దేశంతో ఆయన ఆ నగరనిర్మాణాన్నే సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. ఆ ప్రాంత రైతులందరూ కూడా ఆయన దార్శనికత పట్ల నమ్మకంతో.. ముందుకు వచ్చి తమ పొలాలు ఇచ్చారు. అయితే అంతలోనే ప్రభుత్వం మారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి.. అమరావతిని స్మశానంగా మార్చాలని కంకణం కట్టుకుని విషం కక్కారు. లక్షకోట్లరూపాయలు అవుతుందని, ప్రభుత్వం ధనం లేదని.. 70 శాతం పూర్తయిన నిర్మాణాలను కూడా బీళ్లుగా వదిలేశారు. మూడు రాజధానుల కాన్సెప్టుతో సర్వనాశనానికి శ్రీకారం చుట్టారు. అయినాసరే.. కేవలం చంద్రబాబునాయుడు సంకల్పం మాత్రమే కాదు, అమరావతి రాజధాని పట్ల రాష్ర్ట ప్రజలు పెంచుకున్న ఆశలు కూడా చాలా బలమైనవి. అందుకే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అమరావతి పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలో జరగబోయే అమరావతి నిర్మాణాలకు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి.
అమరావతిలో దాదాపు 37వేల కోట్ల రూపాయల పైచిలుకు పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు పొందిన సంస్థలకు అగ్రిమెంట్లను కూడా అందజేయబోతున్నారు. ప్రపంచబ్యాంకు- ఏడీబీ కలిపి అందజేస్తున్న 15వేల కోట్ల రూపాయల రుణసదుపాయానికి సంబంధించి ఎన్నడో ఒప్పందాలు పూర్తయ్యాయి. తాజాగా రాజధాని పనులకు 11 వేల కోట్ల రుణం పొందడంపై చంద్రబాబునాయుడు సమక్షంలో సీఆర్డీయే మరియు హడ్కో మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రుణ మంజూరుకు జనవరిలో హడ్కో బోర్డుసమావేశం ఆమోదం తెలియజేయగా తాజాగా ఒప్పందం కుదిరింది. ఈ హడ్కో రుణం కూడా అందుబాటులోకి వస్తుండడంతో.. అమరావతి పనులు టాప్ గేర్ లో పరుగులు తీయనున్నాయి.
దానికితోడు ఏప్రిల్ లో పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ రానున్నారు. ఆయనను ఆహ్వానించడానికి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. అమరావతి రాజధాని పట్ల భాజపా కూడా ఎంతో సహకారం అందిస్తున్న ప్రస్తుత సమయంలో.. శంకుస్థాపన సభలో ప్రధాని నరేంద్రమోడీ నుంచి అమరావతికి మరిన్ని వరాలు దక్కుతాయనే ఆశ కూడా ప్రజల్లో కనిపిస్తోంది. మొత్తానికి రాజధానికి ఎన్నో శుభశకునాలు కనిపిస్తున్నాయని అంతా హర్షిస్తున్నారు.
అమరావతి నిర్మాణలకు అన్నీ శుభశకునాలే!
Monday, March 17, 2025
