సొంతచెల్లిని బూతులు తిట్టించి.. అరువు చెల్లికోసం మొసలి కన్నీరు!

Friday, December 5, 2025

నగరిలో వివాదం అసలు ఎలా మొదలైంది. ఏపీలో ఉచితంగా దొరుకుతున్న ఇసుకను తమిళనాడులోకి  అక్రమరవాణా చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. వాటితో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో ఇధ్దరు వైసీపీ కౌన్సిలర్లు. రోజాకు ఆగ్రహం వచ్చింది.. ఎమ్మెల్యే భానుప్రకాష్ అవినీతి చేస్తున్నారని.. నిత్యం స్మగ్లింగులు చేస్తున్నారని, తమ పార్టీవారిని అన్యాయంగా అరెస్టు చేశారని రెచ్చిపోయారు.

దానికి జవాబుగా.. ఆర్కే రోజా నగరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రోజుల్లో.. పేదలకు ఏ పనిచేసిపెట్టాలన్నా సరే లంచాలు తీసుకునే వారని.. రెండువేలు ఇస్తే చాలు ఏపనైనా చేసేవారని గాలి భానుప్రకాష్ కూడా విమర్శించారు. ఇది కేవలం అవినీతి గురించిన విమర్శ కాగా.. ఈ మాటల్లో జగన్ మరియు ఆయన దళాలు బూతును వెతుక్కున్నాయి. రోజాను బూతులు తిట్టిన భానుప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని వారంతా గగ్గోలు పెడుతున్నారు. కాగా, కొన్నిరోజులు ఆలస్యంగా.. యలహంక ప్యాలెస్ కు చేరుకున్న తర్వాత రాచకార్యాలు అన్నీ ముగించుకుని, తీరిగ్గా ఈ విషయం గురించి తెలుసుకున్నట్టుగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. రోజాకు మద్దతుగా ఒక ట్వీట్ చేశారు.

‘‘మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, నా సోదరి రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన ఆర్‌కె రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.

తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ను గమనించిన ప్రజలు మాత్రం.. జగన్ యొక్క అల్పత్వానికి నవ్వుకుంటున్నారు. ఆస్తుల కోసం కక్కుర్తి పడి.. తన సొంత చెల్లెలి గురించి అత్యంత అసభ్యంగా తన అనుచరులతో సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టించిన వ్యక్తి జగన్. తన సొంత కన్నతల్లి కేరక్టర్ ను అవమానించే విధంగా తన అనుచరులతో తప్పుడు పోస్టులు పెట్టించి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి జగన్. అలాంటి నాయకుడు.. సొంత చెల్లిని బూతులు తిట్టించి.. ఇప్పుడు అరువు చెల్లెలికోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అత్యంత నీచంగా మాట్లాడితే కనీసంగా కూడా స్పందించని జగన్.. ఇప్పుడు కేవలం అవినీతి గురించి, తీసుకునే కమిషన్ల గురించి మాట్లాడినందుకు అసభ్యపు మాటలంటూ అరెస్టుకు డిమాండ్ చేయడం కామెడీగా ఉన్నదని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles