అధికారంలో ఉన్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల కోసం ఏం చేశారో కచ్చితంగా తేల్చి చెప్పడం కష్టం. ప్రజలకు డబ్బు పంచి పెట్టడం ఒక్కటే పరిపాలన అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. రకరకాల పథకాల పేర్లు పెట్టి రకరకాల వర్గాల నుంచి మనుషులను ఎంపిక చేసి ఆ పనిని ఆయన నిర్విఘ్నంగా పూర్తి చేశారు. అభివృద్ధి అనే పదం జోలికి వెళ్లకుండా ఐదేళ్ల పరిపాలనను కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి! అయితే ఈ ఐదేళ్ల పాలన కాలంలో విపరీతంగా అవినీతికి అక్రమార్జనలకు పాల్పడ్డారని ఆరోపణలను మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ప్రకారం నమ్మదగిన రెండు మూడు కేటగిరీలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో దోచుకున్న సొమ్మును కూడితే లక్ష కోట్లకు పైగానే అవుతోంది. ప్రజలు నివ్వెరపోయినా సరే ఇది నిజం. ఎలాగో చూద్దాం…
తాజాగా కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని మైసూరు వారి పల్లెలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు ఏం కావాలో గ్రామసభలో ప్రజలే నిర్ణయించుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక పనులు చేపడతామని కూడా తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 41 వేల కోట్ల రూపాయలకు పైగా పనులు చేపట్టినట్లు రికార్డుల్లో చూపించారని, కానీ క్షేత్రస్థాయిలో 15 వేల కోట్ల రూపాయల పనులు మాత్రమే ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉపాధి హామీ పనులు ముసుగులో 25 వేల కోట్ల రూపాయలకు పైగా స్వాహా చేశారని ఆయన విమర్శించారు.
ఇది ఒక కేటగిరి కాగా.. లిక్కర్, ఇసుక అక్రమ దందాలు మరో రెండు ముఖ్యమైన కేటగిరీలు! ఆ రెండు వ్యాపారాల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక వ్యాపారం విషయానికి వస్తే అక్రమ బిల్లులు, దందాల ద్వారా 30 వేల కోట్ల రూపాయలకు పైగా ఐదేళ్ల పాలన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాహా చేశారనేది అధ్యయనం తరువాత ప్రభుత్వం వెల్లడించిన సంగతి. అదే సమయంలో లిక్కర్ అక్రమ వ్యాపారంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తే.. కూటమిలోని ఆయన సహచర పార్టీలు జనసేన, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. కేవలం భారీగా అంటే సరిపోదు.. 50 వేల కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ వ్యాపారం ముసుగులో దిగమించారు- అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ! ఈ గణాంకాల ప్రకారం కనీసం ఈ మూడు కేటగిరీలలోనే లక్ష కోట్ల రూపాయలకు పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన అనుచర దళాలు స్వాహా చేసినట్లు మనకు అర్థమవుతోంది.
జగన్ పదేపదే తాను 2.61 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచిపెట్టానని డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఈ గణాంకాల వాస్తవాలను ఆయన కళ్ళ ముందు ఉంచితే లక్ష కోట్ల రూపాయలకు పైగా కేవలం మూడు విభాగాలలో తమ పార్టీ నాయకులందరూ కలిసి స్వాహా చేశారని తెలిస్తే బహుశా మొహం చాటేస్తారేమో..!