అయిదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత వేధింపులకు బలైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. ఇంకా మొదలుపెట్టని తన రాజకీయ ప్రస్థానం గురించి ఏబీవీ చెబుతున్న మాటలు.. జగన్ కోటరీలో టెర్రర్ పుట్టిస్తున్నాయి. ముందు ముందు ఆయన తమ పార్టీకి ఎన్ని చికాకులు తెచ్చిపెడతారో.. అని భయపడుతున్నారు. అయిదేళ్లపాటు తనను జగన్ వేధించిన దానికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా.. జగన్ ను టార్గెట్ చేయడంతో పర్యవసానాలపై వారిలో బెంగ మొదలవుతోంది.
ఏబీ వెంకటేశ్వరరావు.. కోడికత్తి శీను ఇంటికి వెళ్లి అతడితో భేటీ అయిన వెంటనే.. వైసీపీలో వణుకు మొదలైంది. ఏం జరుగుతుందో ఏమో అని భయపడిన వాళ్లు.. అత్యంత చవకబారు, లాజిక్ లేని ఆరోపణలతో విరుచుకు పడ్డారు. కోడికత్తి శీనును కలవడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని చంపించడానికి ఏబీ వెంకటేశ్వరరావు కొత్త కుట్రలు చేస్తున్నారంటూ నిందలు వేయడం ప్రారంభించింది. అలాంటి అతిశయమైన ఆరోపణలుచేస్తే.. ఆయన భయపడతారని వారు భావించారేమో తెలియదు. కానీ ఆ మాజీ ఐపీఎస్ అధికారి.. నెమ్మదిగా బాంబులాంటి సంగతులను వైపీపీ వారి మీదకు సంధిస్తున్నారు. త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. సొంత పార్టీ స్థాపించాలా? లేదా, ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలా? అనే విషయంలో తనకు వాట్సప్ ద్వారా సలహాలు ఇవ్వాలని.. ఒక నెంబరును కూడా ఆయన ప్రకటించారు.
ఈ ప్రకటన తర్వాత ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఏబీవీ .. తన రాజకీయ ప్రస్థానపు ఆలోచన వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని కూడా వివరించారు. అయిదేళ్ల పదవీకాలంలో జగన్మోహన్ రెడ్డి బాధితులు అందరికీ న్యాయం జరిగేలా చూడడమే తన రాజకీయ ప్రస్థానం లక్ష్యం అని వెల్లడించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కోడికత్తి శీనును కూడా కలిసినట్టు వెల్లడించారు. అన్యాయంగా ఆరేళ్లపాటు జైల్లో మగ్గిపోయేలా జగన్ చేశారని ఆరోపించారు.
కేవలం తెలుగుదేశానికి అనుకూలమైన అధికారి అనే అనుమానంతో, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే కక్షతో.. ఏబీ వెంకటేశ్వరరావును పలుమార్లుసస్పెండ్ చేయడం ద్వారా.. జగన్ సర్కారు ఎంతగా వేధించిందో అందరికీ తెలుసు. సుప్రీం కోర్టు తీర్పు తెచ్చుకుని.. వచ్చినప్పటికీ.. పదవీ విరమణ చివరి రోజు వరకు ఆయన పోస్టింగు ఇవ్వకుండా ఒక శాడిస్టిక్ ప్లెజర్ ను జగన్ అనుభవించారని అంతా అనుకున్నారు. అధికారం దిగిపోయిన తర్వాత.. ఇప్పుడు ఏబీవీ వంతు వచ్చింది. జగన్ అప్పట్లో వేధించిన అందరినీ పోగేసి ఆయన రాజకీయ శక్తిగా మార్చదలచుకున్నట్టుగా ఈ మాటలను బట్టి అర్థమవుతోంది. జగన్ బాధితులకు న్యాయం జరగడమే తన ఏకైక లక్ష్యం అంటున్నారు. కోడికత్తి శీనును కలిశారు. ముందు ముందు ఇంకా జగన్ బాధిత అమాయకులు, సామాన్యులందరినీ కలుస్తారని అర్థం చేసుకోవచ్చు. వారందరినీ జగన్ మీకు ఎక్కు పెట్టిన పాశుపతాస్త్రాలుగా మారుస్తారేమోనని జగన్ కోటరీ నాయకులు భయపడిపోతున్నారు.
జగన్ లో టెర్రర్ పుట్టిస్తున్న ఏబీవీ అడుగులు!
Saturday, April 26, 2025
