కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. మంగళవారం నాడు కడపజిల్లాలో హైడ్రామా నడిపించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను అరెస్టు చేసి, తమ అదుపులోకి తీసుకోగా, ఆయన వారి కళ్లుగప్పి పారిపోయారు. పార్టీ ఆఫీసుకు చేరుకుని.. అక్కడినుంచి కార్యకర్తలను రెచ్చగొడుతూ తన కుట్రమంత్రాంగం నడిపేందుకు ప్రయత్నించారు. తమ అదుపులోంచి ఎంపీ పారిపోయిన సంగతిని గుర్తించిన పోలీసులు, డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసుకు వచ్చి.. ఆయనను మళ్లీ అదుపులోకి తీసుకుని నిర్బంధించాల్సి వచ్చింది.
చెదురుమదురుగా ఒకటిరెండు ఘటనలు మినహా.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. తొలినుంచి ఈ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ వంతు కుట్ర రచన చేస్తుండగా, పోలీసులు పెద్దసంఖ్యలో బలగాలను మోహరించి తదనుగుణమైన ఏర్పాట్లు చేశారు. పలువురు నాయకులను ముందే బైండోవర్ చేశారు. అల్లర్లకు కారణం కాగలరని, కార్యకర్తలను రెచ్చగొట్టి ఇబ్బందులు కలిగిస్తారని అనిపించిన వారిని ముందే అరెస్టు చేశారు.
ఆ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డిని మంగళవారం ఉదయమే అరెస్టు చేశారు. అలాగే తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంప్రసాద్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఇరు పార్టీల నుంచి మరికొందరు నాయకులను గృహనిర్బంధం చేశారు. అవినాష్ రెడ్డి మాత్రం పులివెందులలోనే తిష్టవేసి అక్కడి పరిస్థితులను రెచ్గగొట్టడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయంతో అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ మొదలైన తర్వాత.. నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టి ఉసిగొల్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం లేకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. అవినాష్ రెడ్డిని ఉదయం అరెస్టు చేసిన తర్వాత కడపకు బయల్దేరారు. వైసీపీ కార్యకర్తలు ఎర్రగుంట్ల వద్ద అడ్డుకోవడంతో అవినాష్ రెడ్డి కూడలి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ క్రమంలోనే పోలీసుల కళ్లుగప్పి.. అవినాష్ తన వాహనంలో ఎర్రగుంట్ల నుంచి పరారయ్యారు.
ఈలోగా పులివెందుల పార్టీ కార్యాలయంలో అవినాష్ రెడ్డి ప్రత్యక్షమై అక్కడినుంచి ఎన్నికల ప్రక్రియను అంచనావేస్తూ.. కార్యకర్తలను రెచ్చగొట్టడానికి, మంత్రాంగం ప్రాంరభించారు. ఆయన అక్కడ ఉన్నట్టుగా తెలుసుకున్న పోలీసులు డీఐజీ కోయప్రవీణ్ ఆధ్వర్యంలో పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చి అవినాష్ మళ్లీ నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఎలా పారిపోతారంటూ ఆయననె హెచ్చరించారు.
మొత్తానికి పోలీసులను తప్పించుకుని అయినా సరే.. పులివెందుల పోలింగ్ లో అలజడి సృష్టించడానికి ప్రయత్నించిన అవినాష్ కుట్రలు ఫలించకుండా పోలీసులు అడ్డుకున్నట్టు అయింది.
