టెన్నిస్ రాకెట్లు రిపేరు చేసుకుంటూ బతికే జీవితం నుంచి హఠాత్తుగా స్వామీజీ అయిపోయి రాజకీయ ప్రముఖులతో కాళ్లు మొక్కించుకునే స్థాయికి వెళ్లిపోయిన అడ్డదారి స్వామీజీ.. స్వరూపానందేంద్ర! ఆయనకు ఉండే అనన్యమైన భక్తగణంలో రాజకీయ ప్రముఖుల్లో వీరభక్తుడు జగన్మోహన్ రెడ్డి. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా.. ముఖ్యమంత్రి గారు తలచుకుంటే.. ఆయన ఆధ్యాత్మిక గురువు గారి అరాచకత్వానికి హద్దుంటుందా? జగన్ రెడ్డి అనుచరగణాలే విచ్చలవిడి అరాచక దందాలకు పాల్పడుతూంటే.. ఆయన గురువుగారు చిన్నపాటి భూదందా చేయలేరా? అందుకు తోడ్పడుతూ.. శిష్యశిఖామణి జగన్మోహన్ రెడ్డి సర్కారు భూమిని కానుకగా భక్తికొద్దీ సమర్పించుకోలేరా? ఖచ్చితంగా అది జరిగితీరుతుంది.
ప్రభుత్వ ఖజానాకు అచ్చంగా 225 కోట్ల రూపాయల నష్టం చేకూర్చే సదరు భూదందా డీల్ జగన్ తన పాలన కాలంలో నడిపించారు. ఆ దందాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.
విశాఖపట్టణానికి చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదీ పీఠానికి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విక్రయించిన 15 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలని చంద్రబాబునాయుడు సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చే మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం ఆమోదిస్తారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అతి పెద్ద భూదందాల్లో ఇది కూడా ఒకటి. అప్పట్లో జగన్.. తన ఆధ్యాత్మిక గురువు, తాను ముఖ్యమంత్రి కావడానికి యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తూ తనను సంతృప్తి పరుస్తూ ఉండే విద్యాస్వరూపానందేంద్రకు భీమిలి సమీపంలో సముద్రతీరానికి అతి దగ్గరగా ఎకరం రూ.లక్ష వంతున 15 ఎకరాల భూమిని విక్రయించారు.
భూమి కేటాయించడంతో ఊరుకోలేదు. అదనంగా అనేక వెసులుబాట్లు కూడా కల్పించారు.
వేదవిద్యను వ్యాప్తి చెందించేందుకు, పీఠానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలకు అనే మిషమీద ఈ భూమిని కేటాయించారు. ఆ 15 ఎకరాల భూమి విలువ ఇంచుమించుగా 225 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా! ఒక్కో ఎకరా సుమారు 15 కోట్లు పలికే భూమిని కేవలం రూ.లక్ష స్వామివారికి జగన్ కానుక చేసుకున్నారు. వేదవిద్య కోసం భూమిని ఇచ్చినట్టుగా జీవో వచ్చిన తర్వాత.. స్వామివారికి కొత్త ఆలోచన మొగ్గ తొడిగింది.
తాము పీఠం నిర్వహణ కోసం ఆదాయం సంపాదించుకోవడానికి వివిధ కార్యకలాపాల నిర్వహణకు భూమిని అడిగామని, జీవోలో పొరబాటుగా వేదవిద్యా వ్యాప్తికి అని రాశారని, కాబట్టి దానిని సవరించి ఇవ్వాలని మళ్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. స్వామి భక్తిలో జగన్ ఎక్కడా తగ్గలేదు. ఆయన కోరినట్టుగా సవరణలో మళ్లీ జీవో ఇప్పించారు. అక్కడ ఆయన వ్యాపారసముదాయాలు, హోటల్లు, రెస్టారెంట్లు, విల్లాలు కట్టుకుని విక్రయించుకున్నా దిక్కులేదన్నమాట.. అంతా పీఠం కోసం ఆదాయం సంపాదించుకోవడానికి కేటాయించిన భూమి అనే ముసుగులో కొట్టుకుపోతుంది.
ఈ గురుశిష్యుల దందాకు చంద్రబాబునాయుడు ఫుల్స్టాప్ పెట్టారు. భూకేటాయింపును రద్దు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ భూకేటాయింపులను కొత్త ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. ఏయే అవసరాలకు ఎవరెవరు ఇలా కారుచవకగా భూములు తీసుకుని.. కనీసం ఆ పనులు మొదలెట్టకుండా దందా సాగిస్తున్నారో.. వారందరికీ బుద్ధి వచ్చేలా భూములు వెనక్కు తీసుకునే ప్రయత్నం జరుగుతందని.. దానికి శారదాపీఠం భూ కేటాయింపు రద్దు అనేది కేవలం శ్రీకారం అని తెలుస్తోంది.