‘బాప్ ఏక్ నెంబర్ కా అంటే.. బేటా దస్ నంబర్ కా’ అన్న సామెత చందంగా ఉంది ఇప్పుడు సజ్జల ఫ్యామిలీ వ్యవహారం. ప్రస్తుతానికి సజ్జల రామక్రిష్ణారెడ్డి.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించిన ఒక్క కేసులో మాత్రమే పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ కొడుకు సజ్జల భార్గవ రెడ్డి పరిస్థితి అలా లేదు. ఆయన మీద అనేక కేసులు నమోదు అవుతున్నాయి. గత ప్రభుత్వం కాలంలో వైసీపీ సోషల్ మీడియా సారథిగా ఉంటూ.. పార్టీ కార్యకర్తలతో.. ప్రత్యర్థి పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల మీద అసహ్యకరమైన పోస్టులు పెట్టించిన భార్గవరెడ్డి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఆయనమీద ఆల్రెడీ లుకౌట్ నోటీసు జారీ అయిఉంది. గుంటూరులో ఖాజాబాబా మీద నమోదైన కేసులో భార్గవ మీద కూడా కేసు నమోదు అయింది. కడపజిల్లాలో అరెస్టు అయిన వర్రా రవీందర్ రెడ్డి వెల్లడించిన వివరాలను బట్టి కేసు నమోదు అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా, హైకోర్టులో ముందస్తు బెయిలు విచారణ సందర్భంగా జరిగిన వాదనలు ఆసక్తికరంగా ఉన్నాయి.
సజ్జల భార్గవ రెడ్డి ఆదేశాలతోనే తాను పోస్టులు పెట్టినట్టుగా గుంటూరుకు చెందిన ఖాజాబాబా వెల్లడించారు. ఆ కేసులో ముందస్తు బెయిలు కోసం భార్గవ కోర్టుకు వెళ్లారు. అయితే ఆయన న్యాయవాది మాట్లాడుతూ.. పిటిషనర్లపై కేసుకు కారణమైన సోషల్ మీడియాలోని అభ్యంతరకర పోస్టులు అన్నీ కూడా ఈ ఏడాది జులై 1 కి ముందునాటివి అని అన్నారు. వాటిపై జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ల కింద కేసులు పెట్టడం చెల్లదు అని వాదించారు.
కానీ కేసు ప్రధాన విషయం అది కాదు. ఆ పోస్టుల వెనుక భార్గవ రెడ్డి పాత్ర ఉన్నదా? లేదా? అనే విషయంలోనే పరిమితమై, ఒక నిందితుడు చెప్పిన మాటలను బట్టి అరెస్టు చేయడం కరెక్టు కాదు అనే వాదనలకు పరిమితమై ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారు. అలాకాకుండా.. అవన్నీ జులై 1కంటె ముదు పెట్టిన పోస్టులు అని వాదించారు. నిజానికి ఈ ఏడాది సెప్టెంబరు 24న పెట్టిన పోస్టులు కూడా కేసులో ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో.. సజ్జల వాదన వీగిపోయింది. దీంతో ముందస్తు బెయిలు సంగతి తరువాత.. కనీసం అప్పటిదాకా అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి కూడా హైకోర్టు తిరస్కరించడం గమనించాల్సిన సంగతి.
తన లాయరు మాటల్లోనే అడ్డంగా దొరికిన చిన్న సజ్జల!
Wednesday, January 22, 2025