రెండు రోజుల కిందట సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఒక రకంగా చెప్పాలంటే విశ్వరూపం చూపించారు. సాధారణంగా రాజకీయ దురుద్దేశాలతో.. కేవలం తమ ప్రత్యర్థులను ఇరుకున పెట్టడానికి వేసే పిటిషన్లు నిత్యం అనేకం సుప్రీం కోర్టు ఎదుటకు వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో సుప్రీం ఆ పిటిషన్లలోని అనుచిత లక్ష్యాలను ముందే గుర్తించి తిరస్కరిస్తుంది. మహా అయితే రాజకీయ ప్రేరేపిత పిటిషన్లని వ్యాఖ్యానిస్తుంది. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహిస్తుంది. అలాంటి తప్పుడు ఉద్దేశాలతో పిటిషన్ వేసినందుకు కొన్ని సందర్భాల్లో జరిమానా కూడా విధిస్తుంది. కానీ.. ‘ఈ పిటిషన్ గురించి ఇంకా ఒక్క మాట మాట్లాడినా సరే ఊరుకునేది లేదు’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించడం అనేది మనం ఎరగం. మీలాంటి సీనియర్లు ఇలాంటి కేసులు కూడా వాదిస్తారా అంటూ సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ మీద జాలి చూపించడం అనేది కూడా అంతగా మనం ఎరగం. అలాంటి పరిణామాలు రెండు రోజుల కిందట సుప్రీంలో తటస్థించాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును చికాకు పెట్టడం తప్ప మరో లక్ష్యం లేదన్నట్టుగా దాఖలైన వ్యాజ్యంపై సుప్రీం ఈ విధంగా ఆగ్రహించింది. చంద్రబాబుపై ప్రస్తుతం ఏపీ సీఐడీ వద్ద పెండింగులో ఉన్న కేసులన్నిటినీ సీబీఐకు బదిలీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను తిరస్కరిస్తూ.. సుప్రీం న్యాయమూర్తి ఆగ్రహించారు. వారి దురుద్దేశాలను ఎండగట్టారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. నేరుగా చంద్రబాబును ఏమీ అనలేక, న్యాయపరమైన ఔచిత్యం లేదని స్పష్టంగా తెలిసిన సందర్భాల్లో తాముగా కాకుండా బినామీలతోను, పెయిడ్ ఆర్టిస్టులతోను కేసులు వేయించడం అనేది రివాజు. అలా సుప్రీం దాకా వెళ్లిన పిటిషన్ విషయంలో ఆ పార్టీకి తల బొప్పి కట్టింది. అలాంటిదే మరో రెండు పిటిషన్లు కూడా తాజాగా సుప్రీం తిరస్కరణఖు గురయ్యాయి. నిజం చెప్పాలంటే ఇది ఇంకా తమాషా అయిన కేసు!
నేరమే జరగలేదు.. నేరపూరితం అని ఆరోపిస్తున్న ఒప్పందమే రద్దయిపోయింది.. అయినా సరే.. నేరానికి పాల్పడ్డారంటూ చంద్రబాబునాయుడు మీద సుమారు 18 ఏళ్లుగా సీబీసీఐడీ వద్ద ఒక కేసు పెండిగులో ఉంది. ఆ రద్దయిన ఒప్పందం కూడా సుమారు 21 ఏళ్ల పాతది. మనుగడలో లేని ఒప్పందం- జరగని నేరం గురించి కేసు మాత్రం రికార్డుల్లో మిగిలిపోయింది. ఆ కేసు విచారణను సీబీసీఐడీ నుంచి సీబీఐకు బదిలీ చేయాలంటూ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు వేసిన పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. 2003లో సీఎంగా చంద్రబాబునాయుడు స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్మాణానికి ఒప్పందాలు చేసుకుంటే.. 2004 లో సీఎం అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి.. వాటిని రద్దుచేసి 2007లో విచారణఖు ఆదేశించారు. ఏ తప్పు జరిగినట్టు తేల్చలేకపోయారు. కానీ కేసు అలాగే ఉండిపోయింది. దానిని సీబీఐకు మార్చాలని 2012 నుంచి ఈ ఇద్దరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గత డిసెంబరులో హైకోర్టు కేసు కొట్టేసిన తర్వాత సుప్రీంకు వెళ్లారు. తాజాగా సుప్రీం కూడా కొట్టేసింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న అనేకానేక కుట్రలు ఒక్కటొక్కటిగా వీగిపోతున్నాయి.
వైసీపీ పెద్దలకు ఈ పరిణామాలు మింగుడుపడకపోవచ్చునని అంతా అనుకుంటున్నారు.
ఈసారి కొంచెం లైట్‌గా : బాబుపై కుట్రలకు సుప్రీంలో బ్రేక్!
Thursday, February 20, 2025
