మానవతా దృక్పథం అంటే ఏమిటి? మనకు అలాంటి మానవతా దృక్పథం ఉంటే అవసరంలో ఉన్నవారికి మాట సాయం చేస్తాం. అంతేతప్ప వారు కేసుల్లో నిందితుడుగా ఉంటూ పోలీసు విచారణను ఎదుర్కొంటూ ఉంటే.. వారి పక్కన కూర్చుని, వారి తరఫున పోలీసులకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించం. అలాంటి మితిమీరిన మానవతా దృక్పథం ప్రదర్శించినందుకు.. జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్వకేట్ జనరల్ గా సేవలందించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు న్యాయస్థానానికి సంజాయిషీ చెప్పవలసిన అగత్యం ఏర్పడింది.
2021లో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినందుకు మాజీ మంత్రి జోగి రమేష్ పోలీస్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! ఆయన హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తికర వాదనలు జరిగాయి. జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నలకు ఆయన పక్కనే కూర్చున్న ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానాలు ఇస్తున్నారంటూ.. విచారణ సందర్భంగా షూట్ చేసిన వీడియోతో సహా ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. నిందితుడిని విచారిస్తుండగా ఆయన పక్కన అసలు మీరు ఎలా కూర్చుంటారు? ఆయనను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఎలా ఇస్తారు? అని కోర్టు పొన్నవోలును నేరుగా ప్రశ్నించడం విశేషం. ఈ విషయంలో ఆయన చెప్పిన సమాధానాలు కూడా సెల్ఫ్ గోల్ వేసుకునే విధంగానే ఉన్నాయి.
విచారణలో నిందితుడి తరపు న్యాయవాది హాజరైనా సరే, పక్కన కూర్చోవడానికి వీల్లేదని.. నిందితుడు కనిపించేంత దూరంలో మాత్రమే కూర్చోవాలని.. నిబంధనలను సీనియర్ న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. పొన్నవోలు మాత్రం న్యాయస్థానానికి తన చర్యలకు విచిత్రమైన భాష్యం చెప్పారు. జోగి రమేష్ కు మూడుసార్లు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే మానవతా దృక్పథంతో స్పందించి వెళ్లానని ఆయన చెప్పారు. తద్వారా పోలీసుల నోటీసులకు వెంటనే స్పందించవలసిన జోగి రమేష్ మూడుసార్లు నోటీసులు ఇస్తే తప్ప ఒక్కసారి కూడా హాజరు కాలేదనే విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టినట్లు అవుతోంది. అదేవిధంగా సిమ్ కార్డు కోసం 20 ఏళ్ల కిందట ఐడియా కంపెనీకి చేసిన దరఖాస్తు మీ దగ్గర ఉందా? ఐఎంఈఐ నెంబర్ ఏమిటి అని ప్రశ్నించారని.. ఆ వివరాలు ఎలా తెలుస్తాయని విచారణధికారికి చెప్పడం కూడా తప్పేనా అని పొన్నవోలు సమాధానం చెప్పారు. అయితే ఆ ప్రశ్నలకు మంత్రి స్థాయిలో సేవలు అందించిన జోగి రమేష్ స్వయంగా ఆ జవాబు చెప్పలేకపోతారా.. పొన్నవోలు కలుగజేసుకుని చెప్పవలసిన అవసరం ఉంటుందా.. అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహం.
ప్రస్తుతానికి బెయిల్ పిటిషన్ విచారణలో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సెప్టెంబర్ 3న కోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తుంది. అయితే ఈ కేసులో జోగి రమేష్ అరెస్టు తప్పకపోవచ్చు అని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసిన కేసులో ఆయన కొడుకు అరెస్టు అయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.