అనగనగా ఒక ప్రముఖ అమాయకుడు!

Thursday, November 21, 2024

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో ఆ పార్టీ వారు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించిన సంగతి అందరికీ తెలుసు. అప్పట్లో చంద్రబాబునాయుడు నివాసం మీద, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడులు, చేసిన విధ్వంసం కూడా అందరికీ తెలుసు. ఆ కేసులను తిరగతోడి, దాడులకు పాల్పడిన వారిని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. రిమాండులో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఇప్పటిదాకా బెయిలు కూడా దొరక్కపోగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ తదితరులు ఇంకా బెయిలు కోసం నిరీక్షించే పర్వంలోనే ఉన్నారు. కాగా.. విచారణ సాగుతున్న క్రమం, జరుగుతున్న అరెస్టులను గమనిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పెద్ద తలకాయల్లో కూడా క్రమంగా గుబులు మొదలైనట్టుగా కనిపిస్తోంది.

వైసీపీ పార్టీకి నెంబర్ టూ గా చక్రం తిప్పిన, ఆల్మోస్ట్ తానే ముఖ్యమంత్రి అన్నంత స్థాయిలో అప్పట్లో పార్టీ మరియు ప్రభుత్వ వ్యవహారాలను శాసిస్తూ వచ్చిన సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద అప్పట్లో జరిగిన దాడి మరియు విధ్వంసం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సజ్జల రామక్రిష్ణారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. కేవలం సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను బట్టి మాత్రమే తన పేరును 120వ నిందితుడిగా చేర్చారని, తనకు ఏ పాపం తెలియదని సజ్జల అంటున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. 41ఏ ప్రకారం తాను రక్షణ పొందకుండా ఉండేందుకు తనమీద హత్యాయత్నం కేసు కూడా జోడించినట్టు ఆయన భావిస్తున్నారు.

‘నేను అమాయకుడిని.. కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటాను.. ముందస్తు బెయిలు మంజూరు చేయండి’ అంటూ సజ్జల హైకోర్టుకు విన్నవించుకోవడం గమనార్హం. ఈ తీరు చూసి.. ప్రముఖ అమాయకుడు పాపం కోర్టును ఆశ్రయించారంటూ జనం నవ్వుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద గానీ, చంద్రబాబునాయుడు ఇంటిమీద గానీ జరిగిన దాడులకు సంబంధించిన రూపకల్పన, ప్రణాళిక రచన తాడేపల్లి ప్యాలెస్ లోను, వైసీపీ కేంద్ర కార్యాలయంలోను జరిగినట్టుగా.. అక్కడినుంచే మార్గదర్శకాలు వచ్చినట్టుగా ఆరోపణలున్నాయి. అలాగే తక్షణ అరెస్టులు జరగకుండా కోర్టు నుంచి తాత్కాలిక ఊరట పొందిన వైసీపీ కీలక నాయకులు విచారణకు సహకరించకుండా దర్యాప్తు అధికారులను ఎన్ని రకాలుగా ముప్పుతిప్పలు పెడుతున్నారో కూడా వార్తలలో వెలుగులోకి వస్తూనే ఉంది. జోగిరమేష్ అనుచరులు పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో నేడో రేపో మాజీ మంత్రి అరెస్టు కూడా తప్పదని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవహారం తన అరెస్టు దాకా వస్తుందని భయపడి సజ్జల ‘అమాయకుడిని’ అంటూ హైకోర్టును ఆశ్రయించారని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles