నిజానికి పులివెందులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అనడానికి కూడా వీల్లేదు. జగన్ కోటలో తెలుగుదేశం పాగా వేసింది– అనే వ్యాఖ్య కూడా కామెడీగా ధ్వనిస్తుంది. ఎందుకంటే.. అది అసలు జగన్ కోట కానే కాదు. ఇన్నాళ్లుగా అది తన కోట అనే మాటలతో జగన్ బాహ్యప్రపంచాన్ని మభ్యపెడుతూ వచ్చారు. అక్కడ బెదిరింపు రాజకీయాలు, దందాలు, ప్రలోభాలు నడిపిస్తూ.. దానిని తమ కోటగా మార్చుకున్నట్టుగా వారు కనిపించారు. ఇప్పుడు తొలసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగేసరికి వారి అసలు బలం ఏమిటో బయటపడింది.
పులివెందుల జడ్పీటీసీ స్థానానికి చరిత్రలో తొలిసారిగా ఎన్నిక జరిగింది. ఇన్నాళ్లూ ఏకగ్రీవ ఎన్నిక అనేది అలవాటుగా ప్రొజెక్టు కాబడిన ఒక చోట ఏకంగా 11 మంది నామినేషన్లు వేయడమే.. అక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగు అని అనుకోవాలి. అప్పటికే వైసీపీ వారికి ఒక క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో తమ పప్పులు ఉడకడం సాధ్యం కాదని వారికి అనిపించింది. అందుకే ప్రచార పర్వం సాగుతున్నప్పటినుంచీ సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. ఎన్నికలు సమీపించే సరికి అన్యాయం జరుగుతున్నదని స్వరంపెంచారు.
ఒకవైపు ఓటుకు ఐదువేలు, పదివేలు వంతున ధరకట్టి ఓటర్లను కొనడానికి ప్రయత్నిస్తూనే.. మరోవైపు తెలుగుదేశం దౌర్జన్యాలు చేస్తున్నదని ఆరోపించడం అవాటుగా మార్చుకున్నారు. పోలింగ్ నాడు ఇంకా పెద్ద హైడ్రామా నడిపించారు. తమ ఓటమి ముందే ఖరారైపోవడంతో, అందుకు ప్రజలనుంచి సంకేతాలు అందడంతో వైసీపీ పోలింగ్ ఏజంట్లు పోలింగ్ కేంద్రాలకు కూడా వెళ్లనేలేదు. తమను రానివ్వడం లేదు.. అంటూ నానా యాగీ చేశారు! సాక్షి కెమెరాలకు తప్ప.. ఎన్నికల్లో జరిగిన అక్రమాలు మరెవ్వరికీ కనిపించనేలేదు. వాళ్లు మాత్రం నానా గోల చేశారు. ఆరు పోలింగ్ కేంద్రాలను వేరే చోటకు మారిస్తే, తమ రిగ్గింగ్ కేంద్రాలు తరలిపోయాయని వారు భయపడ్డారు. రెండు చోట్ల రీపోలింగ్ పెడితే వాటిని బహిష్కరించారు.
తీరా కౌంటింగ్ నాడు జగన్ అసలు బలం ఏమిటో తేటతెల్లం అయింది. పులివెందుల నా కోట అని చెప్పుకునే జగన్ మాటలన్నీ అబద్ధాలు అని తేలిపోతున్నాయి. జగన్ తన యాత్రలకు జనాన్ని తోలించుకుంటూ ఎన్ని గప్పాలు కొడుతున్నా.. వాస్తవంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే ప్రాభవం ఎలా మసకబారుతున్నదో అర్థం చేసుకోవడానికి ఇది ఉదాహరణ అని ప్రజలు అనుకుంటున్నారు.
