ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత ఇప్పుడు మహిళలకు ప్రకటించిన అద్భుతమైన వరం.. ఉచిత బస్సు ప్రయాణం ను అమలులోకి తెస్తోంది. ఈ హామీలు అమలు కోసం మహిళలు ఇంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ హామీని చాలా పక్కాగా అమలు చేయడానికి సుదీర్ఘమైన కసరత్తు చేసింది. మంత్రుల అధికారుల బృందాన్ని ఇతర రాష్ట్రాలకు పంపి అధ్యయనం చేయించింది. మొత్తానికి ఈ కసరత్తు జరుగుతున్న సమయంలో చంద్రబాబునాయుడు ప్రజలకు ఒక మాట ఇచ్చారు. ప్రజలకు మాట ఇచ్చిన దానికంటె మెరుగ్గా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత పకడ్బందీగా దీనిని అమలు చేస్తాం అని చెప్పారు. ఆ మాటల అర్థమేమిటో ప్రజలకు ఇప్పుడు బోధపడుతోంది. కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ఏ ఇతర రాష్ట్రాల్లోనూ లేనంత పకడ్బందీగా సురక్షితమైన ప్రయాణాన్ని కూడా మహిళలకు ఏపీలో అందించబోతున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మహిళలకు తమ సొంత జిల్లాల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పిస్తాం అని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇది కేవలం పేద మహిళలు మెరుగైన ఉపాధులు, ఉద్యోగాలు పొందడానికి ఉపయోగపడాలని ఆయన లక్ష్యించారు. రవాణా ఉచితంగా ఉంటే గనుక.. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా సమీపంలోని పెద్ద ఊర్లు, పట్టణాలకు ప్రతిరోజూ వెళ్లి.. అక్కడ తమకు తగిన ఏదైనా మంచి ఉద్యోగాలను, ఉపాధి పనులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ చిన్న జీతాలు వచ్చినా సరే.. వారికి ప్రయాణాల ఖర్చు ఉండదు కాబట్టి.. అంతా లాభమే.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే.. చంద్రబాబునాయుడు మహిళలకు వారి సొంత జిల్లాల వరకు ఉచిత ప్రయాణం కల్పించినా సరిపోయేది. దీనివల్ల కాగల ఖర్చు చాలా పరిమితంగా ఉండేది. అలాకాకపోయినా, కనీసం పూర్వ ఉమ్మడి జిల్లాలకు పరిమితం చేసినా ఖర్చు తక్కువగానే అయ్యేది. కానీ చంద్రబాబునాయుడు సర్కారు చాలా ఉదారంగా రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇప్పుడు ఉచిత ప్రయాణం మాత్రమే కాదు. ప్రతి బస్సులో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. మహిళల రద్దీ పెరగడంతో పాటు, మహిళలు ప్రయాణాలు కూడా పెరుగుతాయి కాబట్టి.. వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు గురికాకుండా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని బస్సుల్లోనూ సీసీ కెమెరాలతో పాటు, కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలు కూడా ఏర్పాటుచేస్తే పటిష్టమైన భద్రత ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం మాత్రమే కాకుండా.. వారి భద్రత గురించి కూడా ప్రభుత్వం ఇంతగా శ్రద్ధ చూపించడం ఏ ఇతర రాష్ట్రాల్లోనూ లేదన్నమాట నిజమే కదా అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
