మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తతిమ్మా అన్ని ప్రాంతాలకు పర్యటనలకు, పరామర్శ యాత్రలకు వెళ్లడం వేరు.. నెల్లూరుకు వెళ్లడం వేరు. పైగా.. నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ రిమాండులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డిని పరామర్శించడానికి జగన్ గతంలో ముహూర్తం నిర్ణయించుకున్న తేదీకి, ఇవాళ్టికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో పోలీసులు అనుమతి ఇచ్చినా కూడా.. జన సమీకరణ వ్యూహాలు ఫలించక జగన్ చివరి నిమిషంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే ఇప్పటికి స్థానిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. జగన్ నెల్లూరు రావడం అంటూ జరిగితే ఆయనకు నల్లజెండాలు, నల్ల బెలూన్లు, నల్ల చీరలతో శాంతియుతంగా తమ నిరసన తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలపోస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని.. అత్యంత అసభ్యంగా, చవకబారుగా, నీచంగా తిట్టిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో జగన్ మౌనం పాటిస్తున్నందుకు నిరసనగా మహిళలు నిరసన తెలియజేయాలని అనుకుంటున్నట్టుగా సమాచారం.
జగన్మోహన్ రెడ్డి తన నెల్లూరు పర్యటనను కేవలం కాకాణితో ములాఖత్ వరకు పరిమితం చేయడం లేదు. ప్రశాంతిరెడ్డిని బూతులు తిట్టిన ప్రసన్నకుమార్ రెడ్డిని ఇంటికి వెళ్లి పరామర్శించాలని అనుకుంటున్నారు. పార్టీ పరువు పోయేలా అసభ్యంగా వ్యవహరించింది ప్రసన్నే కాగా, ఆయన ఇంటికి వెళ్లి ఏమని ఓదార్చడానికి జగన్ సిద్ధమవుతున్నారో ఆయనకే తెలియాలని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రసన్న ఇంటికి జగన్ వెళ్లడం అనేది ఖచ్చితంగా వేమిరెడ్డి వర్గీయుల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని రెచ్చగొట్టే చర్య అని అందరూ భావిస్తున్నారు. అందుకే జగన్ కు బుద్ధి వచ్చేలా నల్లజెండాలు, నల్ల బెలూన్లు, నల్ల చీరలతో శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయాలని వారు భావిస్తున్నారు.
అమరావతి మహిళల గురించి చులకనగా తన చానెల్లో మాట్లాడించి, అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించినప్పుడు.. ఆ తర్వాత జగన్ పర్యటనలో ఇలాంటి నిరసనలు ఎదురయ్యాయి. ఆ నిరసన కారుల మీద, పోలీసుల మీద కూడా వైసీపీ గూండాలు రాళ్లు రువ్వి నానా రచ్చ చేశారు. అయితే.. ఈసారి నెల్లూరులో మరింత ప్రశాంతంగా జగన్ తీరుమీద స్థానికులు నిరసనలు వ్యక్తం చేయడానికి పూనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కాకాణితో ములాఖత్ తరువాత.. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ వెళుతున్నప్పుడు రోడ్డుకు ఇరువైపులా నల్లజెండాలు, నల్లబెలూన్లు, ప్లకార్డులతో నిల్చుని శాంతియుతంగా తమ నిరసన తెలియజేయాలని తెలుగుదేశం వారు భావిస్తున్నారు.
వారు ఎంత శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసినా సరే.. జగన్ అసహనానికి గురి కావడం అనేది గ్యారంటీ. ఆ అసహనాన్ని ఆయన కేవలం ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద చిందులు తొక్కడం వరకు పరిమితం చేస్తారో, నెల్లూరులో కూడా తన అనుచరులు, పార్టీ గూండాలతో నిరసనకారుల మీద దాడులు చేయిస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరులో జగన్ కు ‘నల్ల స్వాగతం’ సిద్ధం!
Monday, December 8, 2025
