జగన్ ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు!

Sunday, January 19, 2025

మరో 16 నెలల పాటు పదవీకాలం ఉన్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వివిధ ఏజెన్సీల ద్వారా సొంతంగా చేయించుకున్న సర్వేలు ఇప్పుడు ఎన్నికలు జరిగితే తిరిగి గెలుపొందవచ్చని, ఆలస్యం అయినా కొద్దీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించడంతో ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. 

గత వారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కలసి నప్పుడు సహితం ముందస్తు ఎన్నికల కోసం `ఆమోదం’ పొందారని తెలుస్తున్నది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జరుపుతున్న బహిరంగసభలు విశేషంగా ప్రజా స్పందన ఉంటూ ఉండడంతో ఆలస్యం జరిగిన కొద్దీ టిడిపి బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఇప్పుడే ఎన్నికలు జరిపితే టిడిపి – జనసేన పొత్తు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చక పోవచ్చని, పొత్తు కుదిరినా అభ్యర్థుల ఎంపికలో గందరగోళంకు గురవుతారని కూడా భావిస్తున్నారు. అన్నింటికీ మించి రోజురోజుకు దిగజారుతున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి జగన్ ను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రస్తుతం  ఎక్కడా అప్పులు కూడా పుట్టని పరిస్థితులు నెలకొన్నాయి. 

దానితో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు సాధ్యం కావడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నారు. ఏదోవిధంగా కష్టపడి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకొంటున్నా మరో మూడు నెలలు గడిస్తే అదికూడా దుర్లభం కాగలదని భయపడుతున్నారు. 

వీటన్నింటికీ మించి వైసీపీ వర్గాలలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో తలెత్తుతున్న కుమ్ములాటలు కాలం గడిచేకొద్దీ  తీవ్రమై పార్టీకి చేటు తెచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎమ్యెల్యేలు, ఇతర ప్రముఖ నాయకులు వరుసగా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం రానున్న సంక్షోభాన్ని  సూచిస్తున్నది.  

అందుకనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని ప్రశాంత్ కిషోర్ బృందం సభ్యులు సహితం సూచించినట్లు చెబుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు స్పష్టం అవుతుంది. సీనియర్ పార్టీ నాయకులకు ఇప్పటికే సంకేతం ఇచ్చినట్లు తెలుస్తున్నది. 

ఏప్రిల్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది.  వర్షాలు సమృద్ధిగా పడుతూ, విద్యుత్ కోతలు లేని సమయంలో అదను చూసుకొని జూలై, ఆగస్టు మాసంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. 

గడువు ప్రకారం లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగవలసి ఉంది. అప్పుడైతే తాము ఏపీ పట్ల దృష్టి సారింపలేమని, అందుకనే తెలంగాణతో పాటు జరిపితే తాము కూడా తమ వంతు పాత్ర వహింపగలమని బీజేపీ నాయకత్వం కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, జాతీయ స్థాయిలో బిజెపిని ప్రశ్నించగల ఓ బలమైన నాయకుడు వచ్చినట్లు అవుతుందని ప్రధానంగా బిజెపి అగ్రనాయకత్వం భయపడుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఈ మధ్య జగన్ మోహన్ రెడ్డి వరుసగా జిల్లాల్లో పర్యటనలు జరుపుతూ ఉండటం కూడా ముందస్తు ఎన్నికల సన్నాహాలను సూచిస్తున్నది. 
కొత్త అప్పులకు జగన్‌ సర్కార్‌ ఎదురుచూస్తోందని, ఏపీలో ప్రభుత్వ పథకాలకు సరిపడా నిధులు లేవని పేర్కొంటూ  ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మినహా వేరే ఆప్షన్ కనిపించడం లేదని తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

 రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి జగన్మోహన్ రెడ్డికి సవాలక్ష కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు.  చిన్న చిన్న పనులు చేయించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, పర్యావరణ అనుమతులు కూడా లభించని పోర్టుల నిర్మాణం పేరిట అప్పులు చేసి ఈ ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. 

పోర్టుల నిర్మాణ ప్రగతిని పరిశీలించాకే, అప్పు మొత్తాన్ని దశల వారీగా విడుదల చేయాలని ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు, అవసరమైన వారందరికీ తెలియజేశానని చెప్పారు. ప్రభుత్వం నిర్వహణకు వక్రమార్గాలలో అప్పులు పుట్టకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మినహా, జగన్మోహన్ రెడ్డికి మరొక ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.  మూడు నెలల తర్వాత ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసే ఆర్థిక పరిస్థితులు లేవని తెలిపారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles