భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంలో దేశవ్యాప్తంగా శుభాకాంక్షల జల్లు కురుస్తోంది. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ తారల వరకు అందరూ తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేక రోజున మోడీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందబోతున్న ఓ భారీ బయోపిక్‌ను “మా వందే” పేరుతో ప్రకటించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మోడీగా కనిపించనున్నారని అధికారికంగా తెలిపారు.
ఈ ప్రకటన తర్వాత ఉన్ని ముకుందన్ మోడీని కలిసి శుభాకాంక్షలు చెప్పిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మోడీకి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందించి మాట్లాడుకున్న సందర్భాలు ప్రత్యేక క్షణాలుగా మారాయి. ఆ విజువల్స్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఉన్ని ముకుందన్‌తో పాటు “మా వందే” చిత్రబృందం మొత్తం మోడీని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టుగా సమాచారం. ప్రస్తుతం మాత్రం రీల్ మోడీ, రియల్ మోడీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
