దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు అని ఒక సామెత ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి జమానాలో.. ఒకే ఒక్క లిక్కర్ కుంభకోణం ద్వారా.. ఆ పార్టీ నేతలందరూ రాష్ట్రాన్ని ముక్కలుగా విభజించి వాటాలు వేసుకుని దోచుకున్న వైనం ఇప్పుడు రకరకాలుగా వెలుగులోకి వస్తోంది. కాంట్రాక్టు సబ్ కాంట్రాక్టు అంటూ మెట్లుమెట్లుగా పనులు చేసినట్టుగా.. ప్రధాన దోపిడీ- ఉపదోపిడీ ఇలా.. అనేకవిధాలుగా వైసీపీ ముఠా నేతలు దోచుకున్న వ్యవహారాలు ఇవి. పెద్దనేతలు తిమింగలాలను మింగితే, ఇతర నేతలు చుట్టూ ఉన్న చిన్న పిల్ల చేపలను మింగి తృప్తి పడ్డారేమో అనిపిస్తోంది. లిక్కర్ రవాణా రూపంలో కూడా ప్రభుత్వ ఖజానాకు 250 కోట్ల రూపాయల మేరకు కాజేసిన వ్యవహారం ఇది.
ఎంతో పారదర్శకమైన కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చాం.. ఎలాంటి ప్రెవేటు వ్యాపారులకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లిక్కర్ షాపులు నిర్వహిస్తున్నాం.. ఈ వ్యాపారం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటుచేశాం..అని జగన్ దళం దబాయించి మరీ చెబుతుంటారు. ఈ ముసుగులో ముడుపులిచ్చిన డిస్టిలరీలకు మాత్రమే సప్లయి ఆర్డర్లు ఇస్తూ, ముడుపులకోసం బెదిరిస్తూ.. మొత్తానికి మూడున్నర వేల కోట్ల రూపాయల సొమ్మును కాజేశారు. ఈ మేరకు జరిగిన అవినీతి గురించి ఇప్పటిదాకా సిట్ విచారణ సాగిస్తోంది. రోజురోజుకూ నిర్ఘాంత పరిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. తాజాగా మరో మలుపు తీసుకుంది ఈ వ్యవహారం. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం కేసులను సరఫరా చేసే యవ్వారంలో కూడా వైసీపీ దళాలు 250 కోట్లకు పైగా కాజేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, కారుమూరి సునీల్, విజయానందరెడ్డి తదితరులు ఈ బాగోతం వెనుక ఉన్నట్టుగా తేలుతోంది.
వివరాల్లోకి వెళితే..
డిపోలనుంచి దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టులు ఇవ్వడం జిల్లాల స్థాయిలో జాయింట్ కలెక్టరు ఆధ్వర్యంలోని కమిటీ చేతిలో ఉండేది. ఎంపిక చేసిన వారికి ఒక్కో మద్యం కేసుకు రూ.13 వంతున చెల్లించేవారు. అధికార వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ లాంటి చెత్త ప్రయోగాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి.. మద్యం రవాణాను మాత్రం.. తన మనుషులు దోచుకోవడానికి వీలుగా కేంద్రీకృతం చేశారు. ఏపీఎస్బీసీఎల్ స్థాయిలో కాంట్రాక్టరును ఎంపికచేసేలా నిబంధనలు మార్చారు. లిక్కరు కుంభకోణానికి ప్రధాన సూత్రధారి ఏ1 నిందితుడు రాజ్ కెసిరెడ్డి, ఏ8 నిందితుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి.. లకు చెందిన ముసుగు కంపెనీ సిగ్మా లాజిస్టిక్స్ ను తెరపైకి తెచ్చి కాంట్రాక్టు పుచ్చుకున్నారు. ఒక్కో కేసుకు రూ.34 చెల్లించేల ఒప్పందం చేసుకున్నారు. అంటే.. మామూలుగా ప్రభుత్వం చెల్లించేదానికంటె ఒక్కో కేసుకు రూ.21 అదనం అన్నమాట. మొత్తంగా సిగ్మా లాజిస్టిక్స్ కు కార్పొరేషన్ రూ.450 కోట్లు చెల్లించింది.
అక్కడే అసలు డ్రామా ఉంది. ఈ సిగ్మా కంపెనీ 5 శాతం కమిషన్ తీసుకుని.. మిగిలినది సబ్ కాంట్రాక్టులకు ఇచ్చింది. జిల్లాలను పంచుకుని కొందరు వైసీపీ నాయకులు నేరుగాను, బినామీ పేర్లతోనూ రవాణా సంస్థల అవతారం ఎత్తి సొమ్ములు వారు దోచుకున్నారు. ఈ జాబితాలో అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కారుమూరి సునీల్, బొత్స సత్యనారాయణ మేనల్లుడు శీను తదితరులు ఉన్నారు. ఈ వ్యవహారం మొత్తం వెలికితీసిన విజిలెన్సు ఇప్పుడు కేసు నమోదు చేసి.. ఆ కేసును సిట్ కు అప్పగించబోతోంది. దొంగలముఠాలు ఊర్లు పంచుకున్నట్టుగా.. రాజ్ కెసిరెడ్డితో కలిసి ఈ నేతలంతా జిల్లాలను పంచుకుని దోచుకున్నారన్నమాట.
