మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది. సరిగ్గా ఇంకో 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేల బృందంతో కలిసి ఈ శాసనసభ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా? ఆయన నిర్ణయించుకోవాలి! ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరై తమ దమ్ము నిరూపించుకోవాలని ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించాలని చంద్రబాబు ఆల్రెడీ సవాలు విసిరారు. ప్రభుత్వం పనిచేస్తున్నదో లేదో, ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో, శాసనసభ వేదికగానే తేల్చుకుందామని చంద్రబాబు నాయుడు పేర్కొన్న నేపథ్యంలో జగన్ ఈ పది రోజుల్లో తీసుకోబోయే నిర్ణయం ఎంతో కీలకం కానుంది. అదే సమయంలో ఆయన ఇప్పటికీ ప్రతిపక్ష హోదా అనే అర్థం లేని పట్టుదలతో ఇంట్లో కూర్చోదలుచుకుంటే గనుక.. ఇక శాశ్వతంగా ఇంట్లో కూర్చోవడమే అవుతుందని ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఉన్నదని అందరూ అంటున్నారు.
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని చంటి పిల్లోడితో పోలుస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా.. ఆయన ప్రవర్తన తీరును రకరకాలుగా ఎద్దేవా చేస్తూ, ప్రజావ్యతిరేక పోకడలను ఎండగడుతూ.. రచ్చబండ యూట్యూబ్ వీడియోలద్వారా ఒక ఆటాడుకున్న వ్యక్తి రఘురామక్రిష్ణరాజు. ఆయన ఇప్పుడు జగన్ ను శాసనసభకు రావాలని ఆహ్వానిస్తూనే.. చంటిపిల్లోడంటూ హేళన చేస్తున్నారు.
ఆయన వ్యాఖ్యానం ఏమిటంటే పసిపిల్లలు చందమామ కోసం మారాం చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు తిరస్కరించిన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను తనకు ఇవ్వాల్సిందేనంటూ పట్టుపడుతున్నారని రఘురామ అంటున్నారు. ఇలాంటి అర్థంలేని పట్టుదలతో 60 రోజులపాటు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుంటే కనుక ఆటోమేటిగ్గా ఆయన ఎమ్మెల్యే పదవి డిస్ క్వాలిఫై అవుతుందని.. పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని రఘురామకృష్ణరాజు జోస్యం చెబుతున్నారు.
వయసులో పెద్దవాడిగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా జగన్ ను శాసనసభకు రావాలని సలహా ఇస్తున్నట్లుగా ఆయన చెబుతున్నారు. జగన్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారో గానీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప శాసనసభలో మాట్లాడడానికి ఎవరికీ అవకాశం రాదు అని ఒక అబద్ధంతో రాష్ట్ర ప్రజలను వంచన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి లాంటి వాళ్లు అవే మాటలను పదే పదే ప్రచారం చేస్తూ ప్రజల్లోకి అబద్ధాల విషాన్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. జగన్ పట్టుదల వీడకపోతే.. పులివెందులకు మాత్రమే కాదు కదా.. ఆయనను నమ్మి వెంట ఉన్నందుకు మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
చంటిపిల్లోడు మారాం చేసినట్టుగా’ జగన్ పంతాలు!
Thursday, December 4, 2025
