శరీరానికి ఒక వ్మాధి సోకుతుంది. మనిషి బతకాలంటే.. సర్జరీ చేయక తప్పని పరిస్థితి వస్తుంది. కోసి, వ్యాధికారకమైన వాటిని పూర్తిగా తొలగిస్తే తప్ప మనిషి బతకడు. అలాంటప్పుడు సర్జరీ చేయాల్సిందే చేసేప్పుడు శరీరాన్ని కోయాల్సి వస్తుంది. ఆ కోత వల్ల కూడా గాయం అవుతుంది. శరీరానికి బాధ కలుగుతుంది. కానీ.. ఆ కోత పెట్టకుంటే.. వ్యాధి నయమయ్యే అవకాశమే ఉండదు. కాబట్టి ఒక వ్యాధి వచ్చినప్పుడు, నయం చేసుకుని ప్రాణాలతో బయటపడాలంటే.. మరికొన్ని బాధలను కూడా తాత్కాలికంగానైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి.. అని ఈ నీతి మనకు చెబుతుంది. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ల విషయంలో రాష్ట్రంలోని పరిస్థితులు ఈ సిద్ధాంతానే మనకు గుర్తు చేస్తున్నాయి.
వికలాంగులకు ప్రభుత్వం అండగా ఉండడం అనేది గొప్ప విషయం. వారి అశక్తత కారణంగా ప్రభుత్వం పెన్షనుతో చేయూత అందిస్తుంటుంది. వికలాంగుల పెన్షన్ల నుంచి అనేక మందిని తొలగించారంటూ ఇప్పుడు చాలా రభస జరుగుతోంది. జగన్ కూడా చంద్రబాబును డైరక్టుగా విమర్శిస్తూ ట్విటర్ లో తన ప్రతాపం చూపిస్తున్నారు. అసలు ఈ లబ్ధిదారులు వెరిఫికేషన్ అనేది ఎందుకు జరుగుతోంది? ఆ అంశాన్ని ముందు పరిశీలించాల్సి ఉంది.
వైఎస్ జగన్ హయాంలో తమ పార్టీ కార్యకర్తలకు రకరకాల మార్గాల్లో అడ్డంగా దోచిపెట్టే ప్రక్రియలో భాగంగా.. వికలాంగుల పెన్షన్లను కూడా ఒక మార్గంగా ఎంచుకున్నారు. అనర్హులను కూడా వేల సంఖ్యలో వికలాంగుల పెన్షన్ల అర్హులుగా చూపించారు. ఏదో ఒక కారణం చూపించి.. వైసీపీ సానుభూతి పరుల్ని వికలాంగుల పెన్షన్లు వచ్చేలాచేశారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు ఇస్తున్న పెన్షనును ఏకంగా ఆరువేలకు పెంచారు. అయితే.. వైసీపీ పాలన పుణ్యమా అని నకిలీ, దొంగ లబ్ధిదారులు పెద్దసంఖ్యలో ఉండడం ఈ పెన్షను వ్యవస్థకే ఒక వ్యాధిలాగా మారిపోయి ఉన్నారు. ఆ వ్యాధి నయం కావాలంటే సర్జరీ చేసి.. నకిలీ లబ్ధిదారుల్ని తొలగించాల్సిందే. అందుకోసం ప్రయత్నంలోనే కొందరు అర్హుల పేర్లు కూడా జాబితాలనుంచి పోయాయి. కానీ ఇది తాత్కాలికం. ప్రభుత్వం మళ్లీ దిద్దుబాటు చర్యలు చేస్తుండడం వల్ల అర్హుల్లో ఎవరికీ అన్యాయం జరిగే అవకాశం లేదు. కానీ.. ఈలోగా ప్రభుత్వం మీద బురద చల్లాలని జగన్ తాపత్రయపడుతున్నారు. ఈ రీవెరిఫికేషన్ జరిగితే, అంటే సర్జరీ జరిగితే, తమ పాలన కాలంలో చేసిన అక్రమాలు, నకిలీ లబ్ధిదారులు బయటపడతారని జగన్ భయపడుతున్నారు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలకు కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా మద్దతిస్తున్నారు. అర్హులకు అన్యాయం చేయకుండా.. దొంగ పింఛన్లను ఏరివేయడం సబబే అని ఆమె అంటున్నారు. అనర్హుల ఏరివేతకు ప్రజలు సానుకూలంగానే ఉండగా.. వైసీపీ మాత్రమే నానా రభస చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
జగన్.. సర్జరీకోసం కత్తిగాటు కూడా గాయమే, నొప్పే!
Thursday, December 4, 2025
