గురివింద గింజ తన వీపు మీద ఉన్న నలుపు గురించి చూసుకోకుండా.. ఎదుటి గింజ నలుపు గురించి హేళన చేస్తుందని సామెత. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విద్యలో ఆరితేరిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో రౌడీషీటరు శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు ఉత్తరాలు ఇచ్చారని, ముందు వారి మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారు. రాజకీయంగా ఈ విషయాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. కానీ వాస్తవాలను గమనిస్తే.. శ్రీకాంత్ పట్ల అనల్పమైన ప్రేమాభిమానాలను ప్రదర్శించడంలో గతంలో జగన్ జమానాలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చెలరేగిపోయిన వైనం బయటకు వస్తోంది. ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఈ మొత్తం వివరాల్ని బయటపెడుతున్నారు.
రౌడీషీటరు శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వవద్దంటూ ఇద్దరు ఐపీఎస్ అధికారులు సిఫారసు చేసినప్పటికీ.. ఆయనకు పెరోల్ రావడం అనేది వివాదాస్పదం అయింది. హోం సెక్రటరీ స్థాయిలో కీలక అధికారి ఒకరు చక్రం తిప్పడం, అనుగ్రహించడం వల్లనే పెరోల్ లభించిందని పుకార్లు వచ్చాయి. శ్రీకాంత్ ప్రియురాలు అరుణ.. హనీట్రాప్ తో అనేకమంది ఐపీఎస్ అధికార్లను, ఎమ్మెల్యేలను కూడా తన గుప్పిట పెట్టుకుని ఉన్నట్టుగా కూడా గుసగుసలు వినిపించాయి. ఐపీఎస్ అధికార్ల వద్ద అరుణ చెప్పిన మాట వేదంగా చెల్లుబాటు అవుతుందని, ఆమెకు సహకరించేవారు అనేకమంది ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి.
జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో దిశ కౌన్సెలింగ్ టీమ్ లో కూడా లేడీ డాన్ అరుణకు కీలకమైన పదవిని కూడా పోలీసు అధికారులు కట్టబెట్టారు. దీనిని వాడుకుని మహిళలను ఆమె ట్రాప్ చేస్తూ, వారిని హనీట్రాప్ కు వాడుకుంటూ ఉండేదని కూడా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని, జైలునుంచి పారిపోయిన శ్రీకాంత్.. విచ్చలవిడిగా తన రౌడీయిజం కార్యకలాపాలు చెలాయిస్తూ వచ్చాడనేది సమాచారం. అరుణకు పదవి కూడా వైసీపీ వారిద్వారానే కట్టబెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. అప్పట్లో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కిలివేటి సంజీవయ్య సిఫారసు ఉత్తరాలు ఇచ్చి శ్రీకాంత్ కు పెరోల్ ఇచ్చినట్టుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు కోటంరెడ్డి, పాశం సునీల్ మీద ఆరోపణలు వచ్చాయి గానీ.. తాము ఇచ్చిన లేఖలపై పెరోల్ ఇవ్వడం కుదరదని పోలీసులు తిరస్కరించినట్టుగా కోటంరెడ్డి రుజువులు చూపిస్తున్నారు. ఆ తర్వాత తాము దాని గురించి పట్టించుకోలేదని అంటున్నారు. తమ సిఫారసు లేఖల్ని తిరస్కరించిన 14 రోజుల తరువాత.. పెరోల్ లభించిందని.. దీని వెనుక ఉన్నదెవరో తేల్చాలని ఆయన అంటున్నారు. అదే సమయంలో.. గత ప్రభుత్వ కాలంలో చెవిరెడ్డి, కిలివేటి ఇచ్చిన లేఖల ఆధారంగానే శ్రీకాంత్ కు పెరోల్ లభించిందనే సంగతిని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.
రౌడీషీటరు శ్రీకాంత్ వ్యవహారాన్ని కెలికేకొద్దీ.. అతడితో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న అక్రమ సంబంధాలన్నీ బయటకు వస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పెరోల్ వ్యవహారంలో వైసీపీ గురివింద నీతి!
Thursday, December 4, 2025
