వైయస్ జగన్ మోహిన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తమ పార్టీ ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండేలా ఆదేశించి ఉంటే ఆయనకు పరువు మిగిలేది. కానీ మోడీ మాట దాటలేని జగన్ మోహన్ రెడ్డి అశక్తత ఆయన ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ఇచ్చేలా చేసింది. ఆ నిర్ణయం ఇప్పుడు ఆయన కొంప ముంచుతోంది. ఈ నిర్ణయం వలన ఏం జరుగుతుందని రెండు రోజులుగా పార్టీ నాయకులందరూ భయపడుతున్నారో.. ఇప్పుడు కచ్చితంగా అదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారధి వైఎస్ షర్మిల ‘ఈ నిర్ణయం ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలుగు జాతికి ద్రోహం ’చేస్తున్నారు అంటూ తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నారు.
తమిళ్ వ్యక్తి రాధాకృష్ణన్ ను దేశ ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవంగా సాధించాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రయత్నించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్.. కాంగ్రెస్ సహా అన్ని పార్టీల వారికి ఫోన్ చేసి ఈ మేరకు అభ్యర్థించారు. అయితే కాంగ్రెస్ పార్టీ వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇండియా కూటమి తరఫున తెలుగువాడైన న్యాయనిపుణుడు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. పోటీ అనివార్యం అయింది.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వంటి గోడమీది పిల్లి వాటం నాయకుల అసలు బుద్ధి బయట పడిపోతుంటుంది. రాష్ట్రంలో కూటమి పార్టీలను విమర్శిస్తూ మనుగడ సాగించే నాయకుడు అయినప్పటికీ.. లోలోపల ఎన్డీఏ సారధులైన భారతీయ జనతా పార్టీ నాయకులపనట్ల ఎంతగా భయంతో వణికి పోతున్నారో మనకు తెలుస్తుంది. అందుకే జగన్ రాధాక్రిష్ణన్ కు మద్దతు ప్రకటించి.. దాన్ని రాజ్యాంగం పట్ల గౌరవం అని రకరకాల మాయమాటలతో సమర్థించుకోవాలని చూస్తున్నారు.
ఇండియా కూటమి తెలుగువ్యక్తిని ఎంపిక చేయడం.. జగన్ ను డిఫెన్సులో పడేయడానికే అని కొందరు అనుకోవచ్చు. కానీ.. జగన్ వారి ఫస్ట్ టార్గెట్ కాదు. తెలంగాణ లో భారాస కూడా ఇలాంటి సంకట స్థితే ఎదురైంది. వారు తెలుగు వ్యక్తి కదా అని ఇండియా కూటమికి జై కొట్టరు. అలాగని బిజెపి కూటమికి ఓటు వేయలేరు. మరి వారు ఏం చేస్తారో.. జగన్ అదే పనిచేసి ఉంటే పోయేది. కానీ.. ఆయన బిజెపి అభ్యర్థికి మద్దతిచ్చారు. ఈ వైఖరిని షర్మిల తప్పుపడుతున్నారు.
వైకాపా అనేది భాజపాకు బిటీమ్ అని మరోసారి తేలుతున్నదని అంటున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ పక్షమే అని తేలిపోయిదని షర్మిల, తన అన్నయ్య పరువు తీస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు చేస్తున్న ద్రోహం అని ఆమె అంటున్నారు.
జగన్ చేస్తున్న ద్రోహంపై నిలదీస్తున్న చెల్లెమ్మ!
Friday, December 5, 2025
