తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ వివిధ ప్రదేశాలలో పర్యటించినప్పుడు ప్రజలను అంటరానివాళ్ళ లాగా చూస్తూ కనీసం దగ్గరకు కూడా రానివ్వకుండా దూరం పెడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తాను ప్రయాణించినంత దూరమూ రోడ్డు పక్కన బారికేడ్లు కట్టించి జనాన్ని నిషేధిస్తూ ఆంక్షలు అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత తన తీరు మార్చుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు అయిన నాటినుంచి ప్రజల మనిషి అయిపోయినట్టు కనిపిస్తున్నారు. ఏ ఊరికి వెళ్ళినా సరే జనం అందరూ తన వాహనం మీదికి ఎగబడి వచ్చేలాగా వారందరికీ కరచాలనాలు ఇవ్వడానికి ఆయన చేయి చాపుతూ అభిమానుల్లో ఒక రకమైన ఉన్మాదాన్ని రేకెత్తించేవారు. ప్రజలు జగన్ మీదికి ఈ రకంగా ఎగబడే ప్రయత్నాలలోనే ప్రతి పర్యటనలోనూ చిన్న పెద్ద ప్రమాదం ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే తాజాగా కడప జిల్లా ఆకేపాడులో ఎమ్మెల్యే ఇంటి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన జగన్మోహన్ రెడ్డి- ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా జాగ్రత్తగా తన పర్యటన పూర్తి చేసుకున్నారు. ధర్మవరంలో పెళ్లికి వెళ్ళినప్పుడు కార్యకర్తలతో ఎదురైన చేదు అనుభవమే ఇందుకు కారణం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నెల 14వ తేదీన అసలే కడప జిల్లా జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తో నిర్వీర్యం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి, అదే రోజు సాయంత్రం ధర్మవరంలో పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. యధావిధిగా అక్కడ కూడా అభిమానులు ఆయన మీదికి పోటెత్తారు. ఆయన కూడా వారిని మరింత రెచ్చగొట్టేలాగా షేక్ హాండ్లు ఇస్తూ వెళ్లారు. ఒక అభిమాని జగన్ చేతిని లాగడం, గోళ్లు గీసుకుని జగన్ చేతికి గాయం కావడం జరిగింది. జగన్ ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సెక్యూరిటీ దళం- అభిమానుల మీదికి విరుచుకుపడి వారిని పిడుగుద్దులతో చితక్కొట్టడం కూడా జరిగింది.
అదే రోజున పెళ్లి వేదిక మీదికి జగన్ వెళ్ళినప్పుడు ఈ అభిమానుల ఓవరాక్షన్ కు ఆ వేదిక మీద ఉన్న వారంతా ఇబ్బంది పడ్డారు. మహిళలు కింద పడిపోవడం జరిగింది. ఒక మహిళ ఏకంగా స్పృహతప్పి ఆసుపత్రిపాలైంది. ఇన్ని చేదు అనుభవాలు జగన్ కు ధర్మవరంలో ఎదురయ్యాయి.
ఈ దెబ్బతో కాస్త పాఠం నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఆకేపాడు పర్యటనలో జాగ్రత్తపడ్డారు. అక్కడ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కొడుకు పెళ్లి రిసెప్షన్కు జగన్ హాజరయ్యారు. ఎప్పటిలాగా జనం ఆయన వాహనాల కాన్వాయ్ మీదికి ఎగబడుతుండగా- ఆయన నియమించుకున్న ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది దగ్గరకు రానివ్వలేదు. ఇదివరకటిలాగా కాకుండా వాహనాల చుట్టూ వలయంలా నిలబడి జనాన్ని నెట్టేశారు. వారిని పూర్తిగా దూరం పెట్టారు. జగన్ కూడా రిసెప్షన్లో వధూవరులను ఆశీర్వదించడం మినహా, ఎక్కడా అతి చేయకుండా కేవలం రెండు చేతులు గాల్లోకి ఎత్తి నమస్కారం పెట్టుకుంటూ వాహనం దిగకుండా అలా నెమ్మదిగా వెళ్లిపోయారు. కార్యకర్తలకు షేక్ హ్యాండ్ రూపంలో చేయి ఇవ్వడం అంటూ జరిగితే మళ్లీ ఎలాంటి ప్రమాదానికి తన గురికావాల్సి వస్తుందో అని భయపడ్డట్టుగా.. జగన్మోహన్ రెడ్డి రెండు చేతులు గాల్లోకి ఎత్తి పెట్టిన నమస్కారం దించకుండా తన యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం!
