ఈసీ పై రాహుల్ దాడి బూమరాంగ్ అవుతోందా?

Friday, December 5, 2025

కేంద్ర ఎన్నికల సంఘం- భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయి ఎన్డీఏకు అనుకూలంగా  నిర్ణయాలు తీసుకుంటున్నదని, వారికోసం పనిచేస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ఈ విమర్శలను ఖండించడం మాత్రమే కాకుండా, రాహుల్ చేస్తున్న విమర్శలకు సరైన సాక్ష్యాలు ఉంటే కనుక ఆఫిడవిట్ రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని వారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే నిబంధనలను గౌరవించే అలవాటు తనకు లేదని- నిబంధనల ప్రకారం నడుచుకోవడం తనకు చిన్నతనం అవుతుందని సంకేతం ఇస్తున్నట్టుగా..  రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. నేను చెప్పవలసింది చెప్పేశాను మసి గుడ్డ కాల్చి మొహాన పడేసాను కడుక్కోవడం మీదే బాధ్యత అన్నట్టుగా రాహుల్ వ్యవహార సరళి ఉంటోంది. ఈసీ అడిగినట్టుగా అఫిడవిట్ ఇవ్వడానికి ఆయన ఏమాత్రం సహకరించడం లేదు.

బీహార్లో ఈసీ- బిజెపితో కలిసి ఓట్ల చోరీకి పాల్పడిందనేది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ. ఆయన ఈ ఆరోపణల్ని తురుపుముక్కగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తొలగించిన ఓట్ల పట్ల ఈసీ వద్ద దొరికే జాబితాలను చేతపట్టుకుని.. వాటిని విశ్లేషించి తనకు తోచినదెల్లా మాట్లాడే రాహుల్ గాంధీ కంటె.. క్షేత్రస్థాయిలో నిజంగానే నకిలీ ఓట్లను తొలగించారో.. ఓట్ల చోరీ చేశారో లేదో అక్కడి స్థానిక ప్రజలకే బాగా అర్థమవుతుంది. ఎన్నికల కమిషన్ ఒకవైపు తాము తీసుకుంటున్న చర్యలు, ఓట్ల తొలగింపు పట్ల చాలా దృఢవైఖరి అవలంబిస్తోంది. ఎన్నికల జాబితాల్లో సంస్కరణల్లో భాగంగానే తొలగించినట్టుగా చెబుతోంది.

రాహుల్ తాను పెద్దగా మాట్లాడడం ద్వారా.. ఈసీ అభ్యంతరాలను పట్టించుకోకుండా పోరాటం చేయడం ద్వారా.. యాత్రలను ప్లాన్ చేయడం ద్వారా.. రాజకీయ మైలేజీ ఈజీ అని అనుకుంటున్నారో ఏమో గానీ.. సామాన్యులకు మాత్రం ఆయన పనుల్లో లాజిక్ కనిపించడం లేదు. ఎందుకంటే.. ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 1 వరకు తొలగించిన ఓట్లపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఈసీ చాలా స్పష్టంగా చెబుతోంది. ఇంకా పదిహేను రోజులు అందుకు సమయం ఉన్నదని కూడా అంటోంది. నిజంగా అన్యాయంగా ఓట్లు తొలగించి ఉంటే వారంతా ఆ విషయం ఈసీ దృష్టికి తీసుకురావచ్చునని  కూడా అంటోంది.

ఇంతకంటె బెటర్ గా ఎవరు మాత్రం చెప్పగలరు. ఒకవేళ రాహుల్ అంటున్నట్టు నిజమైన ఓట్లు తొలగించారే అనుకుందాం.. ఆ తప్పును దిద్దుకోవడానికి వారంతట వారే అవకాశం ఇచ్చినప్పుడు దానిని వినియోగించుకోకుండా ఏకపక్షంగా బురద చల్లడంలో విజ్ఞత ఉందా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
తాను చేసిన ఆరోపణల పట్ల నిబద్ధతతో అఫిడవిట్ ఇవ్వడానికి కూడా సాహసం లేని రాహుల్ వాదనలు, తేడాలు ఉంటే దిద్దుతాం అని అంటున్న ఈసీ సానుకూల వైఖరి వీటి మధ్య.. అసలు రాహుల్ చేస్తున్న ఏకపక్ష ఆరోపణలు బూమరాంగ్ అవుతున్నాయని పలువురు  భావిస్తున్నారు. ఈ విమర్శలు ఓటుచోరీ పోరాటం.. కేవలం ఆయన అత్యుత్సాహంగా తేలుతుందని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles