తాను చదువుకున్న మునిసిపల్ పాఠశాలకు భారీగా విరాళాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. వివిధ సంస్థల నుంచి సీఎస్సార్ నిధులను కూడా రాబట్టి.. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ప్రస్తావించుకునే విధంగా.. అద్భుతంగా తీర్చిదిద్దారు మంత్రి నారాయణ. నెల్లూరులో వీఆర్ మునిసిపల్ హైస్కూలులో అడ్మిషన్లకోసం ప్రజలు ఎగబడుతున్నారంటే,, అడ్మిషన్లు ముగిశాయి అని బోర్డు పెట్టారంటే.. నారాయణ కృషే కారణం. అయితే కేవలం తాను చదువుకున్న ఒక్క స్కూలు మాత్రమే కాదు.. తన ఊరిలోని అన్ని స్కూళ్లను కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దడమే తక్షణ కర్తవ్యం అని మంత్రి నారాయణ భావిస్తున్నట్టుగా ఉంది. ఈ దిశగా ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రభుత్వరంగంలోని విద్యావ్యవస్థ బాగుపడాలంటే.. విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదువులకోసం ఎగబడాలంటే.. రాష్ట్రంలోని మిగిలిన నాయకులందరూ కూడా.. మంత్రి నారాయణ బాటను అనుసరించాల్సిన అవసరం ఉంది.
నెల్లూరులో మంత్రి నారాయణ నగరంలోని అన్ని మునిసిపల్ పాఠశాలలను సందర్శించారు. నగరంలోని మొత్తం 15 ఉన్నత పాఠశాలలను కూడా వీఆర్ హైస్కూలు తరహాలోనే అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేలోగా.. నెల్లూరులోని అన్ని మునిసిపల్ స్కూళ్లను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని, పీ4 విధానం ద్వారా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడులను పూర్తిగా అభివృద్ధి చేస్తాం అని అంటున్నారు.
మంత్రి నారాయణ తాను చదువుకున్న వీఆర్ హైస్కూలును రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాల అనదగిన విధంగా తీర్చిదిద్దిన తర్వాత.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక సంగతి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పాఠశాలను ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తాం అని, ప్రభుత్వ రంగంలో విద్యను ప్రోత్సాహిస్తామని అన్నారు. నిజానికి నారా లోకేష్ చెప్పినదే పేదల విద్యకు అతిపెద్ద హామీ అనుకుంటుండగా.. ఇప్పుడు నారాయణ నెల్లూరు నగరంలోని మొత్తం అన్ని మునిసిపల్ స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తాం అంటున్నారు.
మంత్రి నారాయణ మాటల్ని రాష్ట్రవ్యాప్తంగా ఉండే మిగిలిన నేతలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కనీసం చంద్రబాబునాయుడు ఆవిష్కరించిన పీ4 విధానం పట్ల విశ్వాసం ఉండే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు అయినా ఈ బాటను అనుసరించాలి. తమ తమ నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను వీఆర్ హైస్కూలుకు పోటీగా అభివృద్ధి చేయడం గురించి ఆలోచించాలి. అలా చేయగలిగినప్పుడు.. మధ్యతరగతి, ఎగువమధ్యతరగతి వారు కూడా.. ప్రెవేటు స్కూళ్లకు వెళ్లడం మానేసి ప్రభుత్వ స్కూళ్లకు వెల్లువెత్తే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వానికి కూడా ఇది చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభ సమయానికి మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థలు సంఖ్యను ఈ ఏడాది కంటె గణనీయంగా పెంచగలిగితే.. వారు సక్సెస్ సాధిస్తున్నట్టే లెక్క. ఆదిశగా అందరూ ప్రయత్నించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
