ఎన్టీఆర్‌ను బుట్టలో వేసే పూచీ రోజా తీసుకున్నారా?

Friday, December 5, 2025

తమ ప్రత్యర్థుల అనుకూలురుగా ముద్ర ఉన్న వ్యక్తులకు సంబంధించి ఏదైనా చిన్న వివాదం రేకెత్తితే చాలు.. రెచ్చిపోయి, వారిని భుజాన వేసుకుని మాట్లాడడం.. తద్వారా.. ఆ వ్యక్తులను తమకు అనుకూలురుగా మార్చుకోవడం.. వాళ్లు తమ మనుషులే అన్నట్టుగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే వక్రప్రచారాలు చేయడం జగన్మోహన్ రెడ్డి దళాలకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పునడు జూ.ఎన్టీఆర్ సినిమా వార్ 2 విషయంలో కూడా అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ చేసినట్టుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యల విషయంలో కూడా వీరు ఇలాంటి కుట్రపూరిత ప్రచారంతో ఎడ్వాంటేజీ తీసుకుంటున్నారు. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ ను కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుట్టలో పడేసే బాధ్యతను, ఆ పార్టీ మాజీ నటి రోజా చేతిలో పెట్టినట్టుగా కనిపిస్తోంది.

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుమళ్ల ప్రసాద్.. జూ.ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా ఒక ఆడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. దీని పర్యవసానంగా పెద్ద వివాదమే నడుస్తోంది. ఆగ్రహించిన జూ.ఎన్టీఆర్ అభిమానులు.. ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నాలు చేయడం, పట్టణంలో ఆయన బొమ్మ ఉన్న ఫ్లెక్సిలు అన్నింటినీ చించేయడం వంటి పనులకు పాల్పడ్డారు. మరోవైపు దగ్గుమళ్ల ప్రసాద్ మాత్రం.. ఆ ఆడియోతో తనకు సంబంధం లేదని.. తన పేరుతో ప్రచారం చేస్తున్నారని.. తన పేరు తీశారు గనుక.. ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకుని ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నానని కూడా లెంపలు వేసుకున్నారు.

అయితే ఇక్కడితో చల్లారిపోగల వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ మరింత రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నడూ లేనిది.. రోజా- జూ.ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేస్తూ కీర్తించడమూ.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంటూ కొనియాడడమూ జరుగుతోంది. ఆయన సినిమాల్ని ఆపేయడం ఎవ్వరికీ సాధ్యం కాదని అంటున్నారు. పనిలో పనిగా హరిహరవీరమల్లుమీద, గేమ్ చేంజర్ మీద ఆమె అలవాటుగా విషం కక్కారు. ఎన్టీఆర్ కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారని అంటూ.. ఆయన మీద పాజిటివ్ గా మాట్లాడుతూ.. ఆయన అభిమానుల్లో తమ పార్టీ పట్ల సానుకూలత పెంచే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

గతంలో కూడా ఇలాంటి కుట్రలు వీరికి అలవాటే అని ప్రజలు అంటున్నారు. అల్లు అర్జున్ తన వ్యక్తిగత పరిచయం రీత్యా ఒక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళితే.. అక్కడికేదో.. జనసేనతో, పవన్ కల్యాణ్ తో విభేదించినట్టుగా, అల్లు అర్జున్ ఇక వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి అన్నట్టుగా ప్రచారం చేసి ఎడ్వాంటేజీ తీసుకోవాలనుకున్న కపటదళం ఇది. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ విషయంలో కూడా ఆయన తమ మనిషి అని చాటుకోవాలని వారు తాపత్రయపడుతున్నట్టుంది. కానీ వారు గమనించాల్సినది ఒకటుంది. రోజా చెప్పినట్టు సినిమాలు- రాజకీయాలు వేర్వేరు! సినిమాల్లో ఎన్టీఆర్ ను అభిమానించేవాళ్లు.. దగ్గుమళ్ల ప్రసాద్ తో తగాదా పెట్టుకోవచ్చు గాక.. కానీ.. తెలుగుదేశం పార్టీ మీద తమ అభిమానం వదలుకోలేరు అని వారు తెలుసుకోవాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles