ఆర్టీసీసంస్థ బాగోగులను కూడా దృష్టిలో ఉంచుకుని ఉచిత బస్సు ప్రయాణం అమలు విషయంలో విధించిన కొన్ని నిబంధనలను రెండోరోజునే సడలించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆర్టీసీ సంస్థ మీద తద్వారా ప్రభుత్వం మీద పడగల భారంకంటె.. మహిళలకు ఒనగూరాల్సిన ప్రయోజనమే మిన్న అని భావించిన ముఖ్యమంత్రి.. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఎలాంటి పరిమితులు లేకుండా నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకాన్ని కార్యరూపంలోకి తెచ్చిన చంద్రబాబునాయుడు.. రెండోరోజునే అధికారులతో ఈ పథకం అమలు తీరుతెన్నులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎలా అమలవుతున్నది, మహిళలకు ఎలాంటి సాధకబాధకాలు ఎదురవుతున్నది ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే పథకాన్ని ప్రారంభించే సమయంలో.. రాష్ట్రంలోని ఘాట్ రోడ్లకు ఇది వర్తించదని నిర్ణయించగా.. తాజాగా ఆ నిబంధన సడలించారు. ప్రత్యేకించి మన్యం, ఏజన్సీ ఏరియాల్లో లక్షల మంది నివాసం ఉంటున్న గ్రామాలు, గూడేలు తమ దైనందిన జీవితం గడపడానికి కూడా ఘాట్ రోడ్లలోనే ప్రయాణించవలసి ఉన్న నేపథ్యంలో… స్త్రీశక్తి పథకం ద్వారా కలిగే లబ్ధికి వారు దూరం కాకుండా ఉండేందుకు చంద్రబాబునాయుడు ఆ నిబంధనను పూర్తిగా సడలిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మహిళలకు, అన్ని మార్గాల్లోనూ సంపూర్ణంగా స్త్రీశక్తి పథకం అందుబాటులోకి వచ్చినట్లు అయింది. మారుమూల ప్రాంతాలు, మన్యం ఏజన్సీ ప్రాంతాలకు చెందిన మహిళల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజు నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం ప్రభుత్వం చేసిన గొప్ప సంకల్పం ఈ పథకం. రాష్ట్రంలో ఆర్టీసీకి 11 వేల బస్సులుండగా దాదాపుగా 8500 బస్సులలో ఉచిత ప్రయాణ అవకాశాన్ని మహిళలకు కల్పిస్తూ అమలు చేశారు.
సూపర్ లగ్జరీ, డీలక్స్, నాన్ స్టాప్, ఏసీ బస్సులలో మాత్రం వర్తింపజేయలేదు. అయితే.. ఆర్టీసీ సంస్థకు ఉన్న ప్రత్యేకమైన కొన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్లలో తిరిగే బస్సులకు ఉచితం వర్తింపజేయరాదని తొలుత నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి-తిరుమల మధ్యతిరిగే బస్సు సర్వీసులు వంటి వాటి విషయంలో ఈ నిర్ణయం బాగానే ఉంటుంది. ఎందుకంటే.. ఆ మార్గంలో తిరిగే వారి అవసరాలు భక్తి తప్ప.. పేదరికమూ ఉపాధీ కానే కాదు. కానీ.. ఏజన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మన్యం ప్రాంతాలు ఎక్కువగా ఉండే మన రాష్ట్రంలో ఘాట్ రోడ్లకు వర్తించకపోతే.. కొన్ని లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం దూరమైనట్టే లెక్క.
అయితే ఈ విషయంలో చంద్రబాబునాయుడు సత్వరమే నిర్ణయం తీసుకున్నారు. పథకం ప్రారంభించిన రెండో రోజునే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. అమలు తీరు తెన్నులు అడిగి తెలుసుకున్న ఆయన.. ఘాట్ రోడ్ల మహిళలకు కూడా ఈ స్త్రీశక్తి వరం ఫలితాలు అంది తీరాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రమంతా ఇప్పుడు మహిళల ఉచిత ప్రయాణానికి ఆటంకాలు తొలగినట్లయింది.
