ఇటీవలి కాలంలో ఇండియన్ సినీ ప్రేక్షకులను ఊపేసిన చిత్రాల్లో యానిమేషన్ మూవీ “మహావతార్ నరసింహ” కూడా ఒకటి. దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను దైవభక్తి, యాక్షన్, భావోద్వేగాలను కలిపి రూపొందించగా, విడుదలై 22 రోజులు అవుతున్నా ఇంకా థియేటర్లలో దూసుకుపోతోంది.
మధ్యలో హరిహర వీరమల్లు, కింగ్డమ్ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా వార్ 2, కూలీ లాంటి భారీ చిత్రాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. అయినప్పటికీ, మహావతార్ నరసింహ హవా తగ్గలేదు. కొత్త సినిమాలు రెండో రోజు నడుస్తున్నప్పుడు, 22వ రోజుకి వచ్చేసిన ఈ సినిమా టికెట్ బుకింగ్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బుక్ మై షో డేటా ప్రకారం, వార్ 2కి గంటకు 60 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతుండగా, కూలీకి సుమారు 39 వేల టికెట్లు విక్రయమవుతున్నాయి. ఈ మధ్య మహావతార్ నరసింహ కూడా గంటకు దాదాపు 20 వేల టికెట్లు సాధిస్తోంది. అంటే కూలీ వసూళ్ల సగం రేంజ్‌లో ఈ చిత్రం ఉంది.
అది కూడా 22 రోజుల క్రితం విడుదలైన సినిమా, పైగా ఎలాంటి స్టార్ హీరో లేకుండా ఈ స్థాయిలో కలెక్షన్లు దక్కించుకోవడం నిజంగా గమనించదగ్గ విషయం. బాక్సాఫీస్ వద్ద ఈ దూకుడు కొనసాగితే, వసూళ్లు ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.
