ఒక సినిమాలో ‘ఐరన్ లెగ్’ అనే పాత్ర ఒకటి ఉంటుంది. సదరు పాత్రధారి ఎక్కడ అడుగుపెడితే చాలు.. అక్కడ సమస్తం మంటగలిసిపోతుంటుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కూడా అలాంటి కీర్తి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఎక్కడ అడుగుపెడితే చాలు.. అక్కడ విధ్వంసమే జరుగుతోంది. లేదా విధ్వంసం జరిగి చోట్ల మాత్రమే ఆయన అడుగు పెడుతున్నారు. చివరికి ధర్మవరంలో తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లికి వెళ్లినా కూడా.. అక్కడ జగన్ దెబ్బకు పెళ్లివేదిక మీద పెద్ద విధ్వంసమే జరిగింది. వేదికమీద ఉన్న అనేక మంది మహిళలు కింద పడిపోవడమూ గాయపడడమూ జరిగింది. చివరికి జగన్ నియమించుకున్న పర్సనల్ భద్రతా సిబ్బంది..వైసీపీ కార్యకర్తల మీద విరుచుకుపడి పిడిగుద్దులు కురిపిస్తూ పలువురిని గాయపరచడం గమనార్హం.
ఇటీవలి కాలంలో గమనిస్తే జగన్ ఎక్కడ అడుగుపెట్టినా ఏదోటి జరుగుతోంది. రెంటపాళ్లలో ఏడాది కిందట మరణించిన కుటుంబం పరామర్శ పేరుతో డ్రామాయాత్ర నిర్వహిస్తే ఇద్దరి ప్రాణాలు బలిగొన్నారు. ఒకరిని తన కారుకిందనే తొక్కించి చంపగా, మరొకరు గుండెపోటుతో పోయారు. బంగారు పాళెం వెళితే.. అక్కడ ట్రాక్టర్ల కొద్దీ మామిడి పంటను రోడ్డుమీద తొక్కించుకుంటూ వెళ్లారు. నెల్లూరు ఆస్పత్రి రోడ్డు మొత్తం తన మూకలతో బ్లాక్ చేయించి.. వైద్యసేవలు సరిగా అందకుండా పలువురు ఉసురుపోసుకున్నారు. తాజాగా ధర్మవరం పెళ్లికి వెళ్లినా కూడా అక్కడ చిన్నపాటి విధ్వంసమే జరిగింది.
పోలీసుల్ని అడిగితే రోప్ పార్టీ ఇవ్వడం లేదని జగన్ తన సొంత భద్రతా సిబ్బందిని పెట్టుకుని వారితో రోప్ పార్టీ ఏర్పాటుచేశారు. జగన్ షేక్ హ్యాండ్ ల పేరుతో కార్యకర్తల్ని రెచ్చగొట్టడంతో వారు ఎగబడడ్డారు. ఒకరు జగన్ చేతిని లాగడంతో ఆయనకు గోళ్లు గీచుకున్నాయి. ఆయన భద్రతా సిబ్బంది రెచ్చిపోయి కార్యకర్తల్ని చితక్కొట్టారు.
జగన్ కు ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు ఆయన రాకకు ముందే కార్యకర్తలు చేరుకుని నానా హంగామా చేశారు. రోడ్డు మీద ట్రాపిక్ గంటకు పైగా స్తంభించింది. రోగిని ఆస్పత్రికి తరలిస్తున్న ఓ అంబులెన్స్ కూడా అరగంట దాకా చిక్కుకుపోయింది.
జగన్ వివాహ వేదిక వద్దకు వచ్చినప్పుడు ఆయనతో పాటు కార్యకర్తలు కూడా వేదిక మీదికి ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో అక్కడ ఉన్న మహిళలు కిందపడ్డారు. ఊపిరాడక బయటకు పరుగులు తీశారు. మడకశిరకు చెందిన అంజలి అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లడంతో.. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
మొత్తానికి జగన్మోహన్ రెడ్డి శుభకార్యాల్లో కేవలం అతిథిగా అడుగుపెట్టినా సరే.. చిన్నపాటి విధ్వంసం జరిగి తీరాల్సిందే.. ఆయనను పెళ్లికి పిలిచిన వారు కూడా.. ‘ఈ తప్పు ఎందుకు చేశామా’ అని పశ్చాత్తాప పడాల్సిందే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
