ఎవరి బుద్ధి ఎలాంటిదో బయటివాళ్లకంటె వాళ్ల సొంత మనుషులకు చాలా బాగా తెలుస్తుంది. ఆ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు.. పుట్టినప్పటినుంచి జగన్ ను, ఆయన తీరును గమనిస్తూనే ఎదిగిన ఆయన సొంత చెల్లెలు షర్మిలకంటె బాగా.. జగన్ బుద్ధుల గురించి మాట్లాడగలిగిన వారు ఎవరుంటారు. అలాంటి షర్మిల ఇప్పుడు జగన్ మీద ఎన్నడూ ఎరగనంత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీసీసీ సారథిగా ఏపీలో కాంగ్రెసు పార్టీ పునర్నిర్మాణం కోసం తన వంతు కష్టం పడుతున్న షర్మిల.. రాహుల్ ను జగన్ విమర్శించడం, చంద్రబాబుతో హాట్ లైన్ లో టచ్ లో ఉంటారని నిందవేయడం పట్ల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
జగన్ పచ్చకామెర్లు సోకినోడిలెక్క మాట్లాడుతున్నారు..అంటూ విరుచుకుపడుతున్నారు.జగన్ కు దమ్ములేదు అంటూ చెల్లెలు తీర్మానిస్తున్నారు. ఇంతకూ ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆగ్రహావేశాలు షర్మిలలో ఎందుకు ఉబికి వచ్చినట్టు?
రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన విషయంలో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. ఆయన విలేకర్ల సమావేశం పెట్టినప్పుడు చంద్రబాబు మీద నిందల పర్వం పూర్తయిన తర్వాత విలేకరన్లు రాహుల్ గాంధీ సాగిస్తున్న వోట్ చోరీ పోరాటం గురించి ప్రస్తావించారు. చాలా కష్టపడి ప్రిపేర్ చేయించుకున్న స్క్రిప్టు పేపర్లను చదవడం తప్ప.. విలేకర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అనేది వైసీపీ అధినేతకు అలవాటు లేని సంగతి. ఆ ప్రశ్నకు ఆయన- ‘రాహుల్ కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి నేను ఇదే చెబుతున్నాను’ అని ఉంటే సరిపోయేది.
కానీ ఆలోచనారహితంగా.. ‘ఏపీలో 42 లక్షల ఓట్లు తేడా వచ్చాయని, వాటి గురించి రాహుల్ మాట్లాడడం లేదని’ అన్నారు. అక్కడితో ఊరుకున్నా సరిపోయేది. ‘తనకు ఏ ప్రశ్న వచ్చినా.. చంద్రబాబును నిందించడానికి దాన్ని వాడుకోకుంటే ఆయనకు నిద్ర పట్టదు గనుక.. ‘రాహుల్ చంద్రబాబుతో హాట్ లైన్ లో టచ్ ఉండి వక్ర రాజకీయం చేస్తున్నారనే’ విమర్శలు చేశారు. ‘వాడెవడబ్బా వాడు.. వాడి పేరేమి మాణికం టాగూరా.. ఆ వాడు నన్ను విమర్ఖిస్తాడు’ అంటూ ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి గురించి చులకనగా మాట్లాడారు. ఇవన్నీ షర్మిలకు సహజంగానే కోపం తెప్పించినట్టున్నాయి.
హాట్ లైన్ మోడీ, అమిత్ షాలతో టచ్ లో ఉంటూ.. మోడీ పాదాల వద్ద సాగిలపడుతున్నది జగన్మోహన్ రెడ్డే అని ఆమె విమర్శిస్తున్నారు. బలప్రదర్శన యాత్రలు, పార్టీ కార్యకర్తల మీదికి కారు ఎక్కించి తొక్కించి చంపడం రాహుల్ కు తెలియదంటున్నారు. తెరవెనుక పొత్తులు జగన్ కు అలవాటు అని.. పచ్చకామెర్లు సోకినట్టుగా, అందరూ తన లాగే ప్రవర్తిస్తుంటారని ఆయన అనుకుంటున్నారని షర్మిల దెప్పిపొడుస్తున్నారు.
జగన్ ది నీతిమాలిన రాజకీయం, జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలపై ప్రశ్నించాలి. మీదో పార్టీ.. మీరొక నాయకుడా.. అంటూ షర్మిల రెచ్చిపోవడం విశేషం.
