జగన్మోహన్ రెడ్డి అతి చేష్టలకు శాస్తి జరిగిందా?

Friday, December 5, 2025

‘నేను అడుగు బయటపెడితే చాలు, అభిమానులు నాకోసం వెల్లువలా ఎగబడుతుంటారు’ అని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. తమాషా ఏమిటంటే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఏ సెలబ్రిటీ కనిపించినా అభిమాన దురభిమానాలతో నిమిత్తం లేకుండా ఎగబడే ప్రజలు కొందరు తప్పకుండా ఉంటారు. వారి అత్యుత్సాహం వల్ల ప్రమాదాలు జరగకుండా.. సెలబ్రిటీలు స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం. పబ్లిక్ లోకి వెళ్లినప్పుడు అభివాదాలు చేయడంతో తమ అభిమానులను సంతృప్తి పరచి ఊరుకోవాలి. అలా కాకుండా అతి చేస్తే.. జగన్ కు ధర్మవరంలో ఎదురైనట్లే చేదు అనుభవాలు తప్పవు.

ప్రత్యేకించి.. ‘నాకు ప్రాణభయం ఉంది.. నన్ను హత్య చేయించడానికి అనేకమంది ప్రయత్నిస్తున్నారు..’ లాంటి కల్లబొల్లి కబుర్లు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ జగన్ ఉద్దేశపూర్వకంగానే అన్నట్లుగా తరచూ భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. జనానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. జగన్ చేయి అందిస్తున్నాడనగానే ఎగబడి ఆ చేయి అందుకునేందుకు ప్రజలు ఉరకడం మామూలే. అందరికీ చేతిని తాకించడం ద్వారా వారంతా తనకోసం వెంపర్లాడుతున్నట్టుగా- ఒక శుష్టమైన ఆత్మానందానికి గురి కావడం జగన్ కు సరదా! అలాంటి సరదాతోనే ఇవాళ ఆయన ఇబ్బంది పడ్డారు.

ధర్మవరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లో పెళ్ళికి హాజరైన జగన్మోహన్ రెడ్డి తాను అతిధిగా వచ్చి, కొత్త దంపతులను ఆశీర్వదించి తిరిగి వెళ్ళడానికి పరిమితమై ఉంటే చాలా బాగుండేది. కానీ తన అలవాటు కొద్దీ షేక్ హ్యాండ్ ల పేరుతో పెళ్లికి వచ్చిన జనం తొక్కిసలాడుకునేలా చేశారు. సెక్యూరిటీ రోప్ దాటుకుని కార్యకర్తలు ఎగబడ్డారు. ఈ ప్రయత్నంలో ఓ అభిమాని జగన్మోహన్ రెడ్డి చేయి పట్టుకొని లాగడం జరిగింది. ఆయన చేతికి గోళ్లు గీచుకుని చిన్న గాయమైనట్టు కూడా చెబుతున్నారు. వెంటనే జగన్ చుట్టూ ఉండే గన్ మ్యాన్ లు ఎగబడి పార్టీ కార్యకర్తలు, అభిమానుల మీద దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టారు.

‘ఇదంతా అవసరమా? పెళ్లికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎంచక్కా తన సెక్యూరిటీ వలయం మధ్యలో చుట్టూ ఉండే జనానికి అభివాదాలు చేసుకుంటూ వెళితే సరిపోయేది కదా’ అనేది సామాన్యుల సందేహం!
ఒకవైపు తన సొంత జిల్లాలో సొంత మండలంలో పరాజయాలను మూటగట్టుకుని, అవమానంతో కృంగిపోతున్న జగన్ ఆ అసహనాన్ని దాచుకోవడానికి ఇలా అతి చేసినట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల్లో కూటమి అరాచకాల వల్ల తెలుగుదేశం గెలిచిందే తప్ప ప్రజలు మాత్రం తన మీదకు అభిమానంతో ఎగబడుతున్నారని ఇలాంటి చర్యల ద్వారా ఆయన చెప్పదలుచుకున్నట్లుగా ఉంది. కానీ అడగకుండానే షేక్ హ్యాండ్ లు ఇవ్వడం, ఆ రూపంలో కార్యకర్తలు తొక్కిసలాడుకునేలా రెచ్చగొట్టడం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి.

ప్రతిసారి యాత్రల పేరుతో డ్రామాలు నడిపిస్తున్నప్పుడు పోలీసులు సెక్యూరిటీ ఎంతో పటిష్టంగా పకడ్బందీగా ఏర్పాటు చేయబట్టి మాత్రమే ఆయన ప్రతి పర్యటన నుంచి సురక్షితంగా తిరిగి ఇల్లు చేరుకున్నారని ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆయన కారు కింద అభిమానులు పడి చచ్చిపోయారు తప్ప, ఏ యాత్రలోనూ ఆయనకు కించిత్తు గాయం కాలేదంటే కేవలం పోలీసుల అనుమతి తీసుకుని వెళ్లడం.. పోలీసు భద్రత వలయం మధ్య ఉండడం వల్ల మాత్రమే! అదే ఇప్పుడు పెళ్లికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఓవరాక్షన్ చేయడం వలన ఆయనకు తగిన శాస్తి జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles